ముంబై, నవంబర్ 27 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ మదుపరుల పెట్టుబడులు, రాబోయే ద్రవ్యసమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు కలిసొచ్చాయి. ఈ క్రమంలోనే గురువారం ఇంట్రా-డే ట్రేడింగ్లో అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ రెండూ సరికొత్త స్థాయిలను తాకాయి. ఒకానొక దశలో మునుపెన్నడూ లేనివిధంగా 86,000 మార్కును దాటి 446.35 పాయింట్లు ఎగిసి సెన్సెక్స్ 86,055.86 వద్దకు వెళ్లింది. నిఫ్టీ కూడా 105.15 పాయింట్లు ఎగబాకి తొలిసారి 26,310.45 వద్దకు చేరింది. దీంతో గత ఏడాది ఇంట్రా-డే ఆల్టైమ్ హై రికార్డులు చెరిగిపోయినైట్టెంది. నిరుడు సెప్టెంబర్ 27న సెన్సెక్స్ 85,978.25 పాయింట్లు, నిఫ్టీ 26,277.35 పాయింట్లను తాకాయి. ఇప్పటిదాకా ఇవే రికార్డు గరిష్ఠాలు.
అయితే 14 నెలల తర్వాత ఈ స్థాయిలను సూచీలు ఇప్పుడే అధిగమించాయి. కాగా, ట్రేడింగ్ మొదలయ్యాక దాదాపు గంటా 10 నిమిషాలు కొనుగోళ్ల ఉత్సాహంతో కదిలిన మదుపరులు.. ఆ తర్వాతి నుంచి లాభాల స్వీకరణకు పెద్దపీట వేశారు. దీంతో సూచీలు ఆల్టైమ్ హైల నుంచి దిగిరాక తప్పలేదు. చివరకు సెన్సెక్స్ 110.87 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 85,720.38 వద్ద ముగియాల్సి వచ్చింది. నిఫ్టీ 10.25 పాయింట్లు లేదా 0.04 శాతం అందుకుని ఆల్టైమ్ హై దగ్గరదాకా వచ్చి 26,215.55 వద్ద నిలిచింది. గత ఏడాది సెప్టెంబర్ 26న 26,216.05 వద్ద ముగిసింది. 0.51 పాయింట్లు పెరిగినా ఈ రికార్డు కనుమరుగయ్యేదే. ఈ క్రమంలో శుక్రవారం ట్రేడింగ్లో సూచీలు లాభాలు పొందితే నయా రికార్డులు నమోదైనట్టే. కాగా, ఆర్థిక సేవలు, ఐటీ, బ్యాంకింగ్, టెక్నాలజీ రంగాల షేర్లు 0.31 శాతం నుంచి 0.03 శాతం వరకు పెరిగాయి. ఇక సెన్సెక్స్ షేర్లలో బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందుస్థాన్ యునీలివర్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ లాభపడ్డాయి.