కట్టంగూర్, మార్చి 08 : మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ఆదివారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, ఉపాధి హామీ సిబ్బందిని శాలువాలతో సన్మానించి మాట్లాడారు. నేటి మహిళలకు ఎనలేని శక్తి ఉందని, తమ సామర్థ్యాలను వినియోగించుకుని ముందుకెళ్లాలన్నారు. గ్రామ స్థాయిలో ఆరోగ్యం, పోషణ, శిశు సంక్షేమం కోసం అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగితేనే పిల్లలు సైతం స్ఫూర్తిని పొంది తమ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకుంటారన్నారు. గ్రామాభివృద్ధిలో మహిళ పాత్ర మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుండు రాంబాబు, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, వార్డు సభ్యులు ఏనుగు సైదులు, పులకరం శ్రీను, ముషం రాణి ఉమేశ్ పాల్గొన్నారు.