Vasundhara Raje : మహిళలు రాజకీయాల్లో రాణించాలంటే పురుషులకంటే మూడు రెట్లు ఎక్కువ కష్టపడాలని సూచించారు రాజస్థాన్ మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధరా రాజే. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యం పెరిగినప్పటికీ.. ఇది సరిపోదని ఆమె వ్యాఖ్యానించారు. జైపూర్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలు రాజకీయాల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
‘‘రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశంలో మహిళల అక్షరాస్యతా శాతం 9. ఇప్పుడు 65 శాతం ఉంది. ప్రస్తుతం సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళల శాతం 10. కానీ, 1957లో 3 శాతమే ఉండేది. తొలి లోక్సభలో పార్లమెంట్లో మహిళల సంఖ్య 22. ఇప్పుడు 74. రాజ్యసభలో 1952లో 15 మంది మహిళలు ఉండేవారు. ఇప్పుడు 42 మంది ఉన్నారు. ఈ సంఖ్య పెరిగింది. కానీ, ఇది సరిపోదు. పురుషులతో సమానంగా మహిళలు చట్టసభల్లో ఉండాలి. హేమా మాలిని, డా.కమలా బెనివాల్, సుమిత్రా సింగ్, డా.ప్రియాంకా చౌదరి, రీతా చౌదరి వంటి ఎందరో మహిళలు రాజకీయాల్లో రాణించారు’’ అని వసుంధరా రాజే వ్యాఖ్యానించారు.
ఆమె బీజేపీ తరఫున ఎన్నికై.. 2003-2008 వరకు, 2013-2018 వరకు రెండు సార్లు రాజస్థాన్ సీఎంగా పని చేశారు. 2023లో ఆమె బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. కానీ, బీజేపీ అధిష్టానం భజన్ లాల్ శర్మను సీఎంగా నియమించింది.