Walking | శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు నడక ఎంతో సహాయపడుతుంది. నడక మన శరీరాన్ని చురుకుగా ఉంచడంతో పాటు మన గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అయితే మనం మన వీలును, శక్తిని, సమయాన్ని బట్టి ఎవరికి తోచినట్టు వారు నడుస్తూ ఉంటారు. అలాగే నడక వేగం కూడా ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. కానీ హార్ట్ జర్నల్ లో ప్రచురితమైన ఓ పరిశోధన ప్రకారం మన నడక వేగం మనలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. వేగంగా నడిచే వారిలో 43 శాతం గుండె సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తేలింది. అలాగే వేగవంతమైన నడక మన గుండెకు బలమైన రక్షణను కల్పిస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. గంటకు 4.8 కి.మీ కంటే ఎక్కువ వేగంతో నడిచిన వారిలో గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉందని అలాగే గంటకు 6.4 కి.మీ కంటే ఎక్కువ వేగంతో నడిచే వారిలో ఇది మరింత ప్రయోజనకరంగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు.
అయితే మన నడక వేగం మన గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని మనలో చాలా మందికి సందేహం వచ్చే ఉంటుంది. మన శరీర ఫిట్నెస్, మన శరీర బలస్థాయిలు మనలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. వేగంగా నడిచే సామర్థ్యం ఉన్నవారు ఆరోగ్యకరమైన కండర ద్రవ్యరాశి కలిగి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. ఇది మన నడక వేగాన్ని, గుండె ఆరోగ్యానికే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి బేరోమీటర్ గా పని చేస్తుంది. అలాగే కార్డియో రెస్పిరేటరీ ఫిట్నెస్ ఎక్కువగా ఉండి, శరీరం యాక్టివిటీ లెవల్స్ ఎక్కువగా ఉంటే, గుండె ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
అంతేకాకుండా వేగంగా నడవడం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినట్టు ఉంటే అది పెద్ద సమస్యను తెలియజేసే చిన్న లక్షణం అయి ఉంటుందని కూడా వారు చెబుతున్నారు. ఎక్కువ వేగంతో నడవడం వల్ల గుండె కండరాలు బలంగా తయారవుతాయి. రక్తప్రసరణ మెరుగుపడడంతో పాటు రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. వేగంగా నడవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. తద్వారా మధుమేహం, ఒత్తిడి కూడా సక్రమంగా నిర్వహించబడుతుంది. ఇవన్నీ హృదయ ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
ఇక అమెరికన్ హార్ట్ అసోసియేషన్, బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ప్రకారం నిమిషానికి 100 నుండి 120 అడుగులు నడవడం మంచిది. ఈ నడక వేగం చురుకైన వర్గంలోకి వస్తుందని వారు తెలియజేస్తున్నారు. ఈ వేగంతో నడవడం వల్ల అధిక రక్తపోటు, ఊబకాయం వంటి ప్రమాద కారకాలు ఉన్నవారిలో మంచి ఫలితాలు కనిపిస్తాయని అధ్యయనం సూచిస్తుంది. ఇక నడక ప్రారంభించే ముందు ముందుగా వార్మప్ తో ప్రారంభించాలి. తరువాత నెమ్మదిగా నడవడం ప్రారంభించి క్రమంగా వేగాన్ని పెంచాలి. నడక ముగించే ముందు వేగాన్ని తగ్గించి నెమ్మదిగా అడుగులు వేసి ముగించాలి. ఈ విధంగా మన నడక వేగం మన హృదయ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.