న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా విధ్వంసానికి గురైన గాజాలో చేతిలో పనిలేక, తినడానికి తిండిలేక, తలదాచుకోవడానికి నీడ కూడా లేని వేలాదిమంది నిరాశ్రయులు చివరకు లైంగిక దోపిడీని ఎదుర్కొనే దుస్థితి దాపురించింది. సహాయ సామగ్రిని పంపిణీ చేసేందుకు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిన కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బంది కామవాంఛలకు గాజా మహిళలు బలవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ కోరికలు తీరిస్తే ఆహారం అందచేస్తామని కొందరు సహాయక సిబ్బంది గాజాలోని నిస్సహాయ మహిళలను లోబరుచుకుంటున్నట్లు తెలుస్తోంది. తన ఆరుగురు పిల్లలకు తిండి పెట్టేందుకు వారాల తరబడి అష్టకష్టాలు పడుతున్న ఓ 38 ఏళ్ల మహిళకు తన ఏజెన్సీలో ఉద్యోగం ఇస్తానని నమ్మించిన సహాయ పంపిణీ కేంద్రం ఉద్యోగి ఒకడు ఓ నిర్జన అపార్ట్మెంట్కు ఆమెను తీసుకెళ్లి తన లైంగిక వాంఛను బయటపెట్టాడు. తన బిడ్డలకు కడుపునిండా తిండి దొరుకుతుందన్న ఆశతో ఆ తల్లి మనసు చంపుకుని అందుకు సిద్ధపడినప్పటికీ 30 డాలర్లు(రూ.2,500), కొంత ఆహారం చేతిలో పెట్టి ఆమెను పంపించివేశాడు. ఉద్యోగం ఇస్తానన్న హామీ మాత్రం ఎన్నాళ్లయినా నెరవేరలేదు. ఇలాంటి ఎన్నో దీనగాథలను బాధిత మహిళలు ఏపీ వార్తాసంస్థకు వెళ్లబోసుకున్నారు.
గర్భం దాల్చిన కొందరు మహిళలు..
మానవతా సహాయం కింద పంపిణీ చేయవలసిన ఆహారం కూడా అక్కడి సిబ్బంది లైంగిక వాంఛలకు ఆయుధంగా మారిపోయింది. తమ కోర్కెలను తీర్చమని సిబ్బంది నేరుగా మహిళలను అడుగుతున్నారంటే నిస్సహాయ మహిళల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొందరైతే సెక్స్ కోర్కెలను తీర్చుకునేందుకు పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచిస్తున్నారు. మహిళల పట్ల లైంగిక దోపిడీ కొత్త సమస్యేమీ కాదని, దక్షిణ సూడాన్, హైతీ వంటి యుద్ధాలతో తల్లడిల్లిన దేశాలన్నిటిలో ఇదే పరిస్థితిని కళ్లారా చూశామని మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ఆహారం కోసం లైంగిక దాడులను ఎదుర్కొన్న వందలాది మంది మహిళలకు చికిత్స అందచేసినట్లు పాలస్తీనా మానసిక నిపుణులు తెలియచేశారు. కొందరు మహిళలు గర్భం కూడా దాల్చారని, సాంప్రదాయ గాజా సమాజంలో తమకు జరిగిన అన్యాయాన్ని కూడా బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఇక్కడి మహిళలది అని వారు చెప్పారు.