మహిళలు వ్యాపార రంగంలో ప్రగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తున్నది. స్త్రీనిధి ద్వారా చేయూతనిస్తున్నది. ఆ రుణాలను సద్వినియోగం చేసుకొని.. ఎంతోమంది ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఒక్క కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే 6,840 మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో 2,683 సంఘాలు స్త్రీనిధి ద్వారా రూ.21.96 కోట్ల రుణాలు పొందాయి. ఆ మొత్తంతో స్వయం ఉపాధిని వెతుక్కుంటున్నారు సామాన్య మహిళలు.
చింతలమానేపల్లి మండలానికి చెందిన భాగ్యలక్ష్మి గ్రామైక్య సంఘంలోని ముగ్గురు సభ్యులు రూ. లక్షా 50 వేల రుణాన్ని తీసుకొని బేకరీ యూనిట్ ప్రారంభించారు. వ్యాపారం లాభసాటిగా నడుస్తున్నది కూడా. ఖర్చులు పోనూ నెలకు ఒక్కొక్కరు రూ.15 వేల వరకూ ఆదాయం పొందుతున్నారు. తమ ఉత్పత్తులను స్థానిక స్వీట్ షాపులు, జనరల్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.
సిర్పూర్-టీలోని మంజునాథ మహిళా సంఘం విజయగాథా అలాంటిదే. ఇద్దరు మహిళలు చేతులు కలిపి.. స్త్రీనిధి రుణంతో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ నెలకొల్పారు. ఖర్చులు పోనూ నెలకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదిస్తున్నారు. శ్రీలక్ష్మి మహిళా సంఘం ఆధ్వర్యంలో నలుగురు మహిళా సభ్యులు జిల్లా కేంద్రంలో సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు. ఇలాంటి విజయగాథలు.. జిల్లాలో అనేకం, రాష్ట్రంలో అపారం.