ప్రతి మహిళ జీవితంలో మెనోపాజ్ అనేది ఒక సహజమైన దశ. అయితే, ఈ ప్రక్రియ.. వారిలో అనేక రకాల మార్పులను తీసుకొస్తుంది. హార్మోన్ల అసమతుల్యత, ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గడం, వేడి ఆవిర్లు, అలసట, మానసిక స్థితిలో మార్పులు, ఎముకల ఆరోగ్యానికి నష్టం.. ఇలాంటి ఎన్నో లక్షణాలకు కారణమవుతుంది. ఈ మార్పులను తట్టుకుంటూ.. తదుపరి జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా కొనసాగించడంలో ‘పోషకాహారం’ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి, మెనోపాజ్‌కు దగ్గరవుతున్న మహిళలు.. తమ ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది.
ప్రొటీన్: మెనోపాజ్ తర్వాత చాలామందిలో కండర ద్రవ్యరాశి తగ్గుతుంది. ఫలితంగా, నీరసం, నిస్సత్తువ ఆవహిస్తుంది. అలాకాకుండా ఉండాలంటే.. శరీరానికి ప్రొటీన్ అవసరం. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి పాల ఉత్పత్తులు, కాయ ధాన్యాలు, సోయా, శనగపప్పులను ఎక్కువగా తీసుకోవాలి.
మెగ్నీషియం: మెనోపాజ్ సమయంలో ఆందోళనలు, కండరాల తిమ్మిరి, నిద్రాభంగం లాంటివి సాధారణంగా కనిపించే సమస్యలు. వీటిని తగ్గించడంలో మెగ్నీషియం ముందుంటుంది. భోజనంలో తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్లను చేర్చుకుంటే.. శరీరానికి కావాల్సిన మెగ్నీషియం అందుతుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: ఈ కొవ్వులు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. మానసిక ఆందోళనలు, వేడి ఆవిర్లను తగ్గించడంలో సాయపడతాయి. అవిసె గింజలు, వాల్నట్స్, చియా గింజలు, సాల్మన్ చేపల నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా దొరుకుతాయి.
క్యాల్షియం: ఈస్ట్రోజెన్ హార్మోన్.. ఎముకల సాంద్రతను కాపాడుతుంది. అయితే, మెనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ క్షీణించడం వల్ల మహిళల్లో బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, ఎముకలు, దంతాలు.. ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, టోఫు, బాదం, పాలకూర, కాలే వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి.
విటమిన్ డి: శరీరం క్యాల్షియంను గ్రహించడానికి, రోగనిరోధక ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం. ఇందుకోసం సూర్యరశ్మిని మించిన సహజ వనరు లేదు. సప్లిమెంట్లు, గుడ్లు, సాల్మన్ చేపల నుంచి కూడా విటమిన్ డిని పొందవచ్చు.
ఈ అన్నిరకాల పోషకాలను రోజువారీ భోజనంలో చేర్చుకోవడం ద్వారా.. మెనోపాజ్ దశలోనూ చురుకుగా ఉంటారు. బలం, విశ్వాసం, సమతుల్యతతో.. ఆ తర్వాతి జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఈ ఆహారంతోపాటు, వైద్యుల సలహామేరకు చిన్నచిన్న వ్యాయామాలను ఆశ్రయిస్తే.. ఎలాంటి అనారోగ్యం దరిచేరకుండా ఉంటారు.