హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ న్యాయవాదుల సంక్షేమ నిధి (అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్)లో సభ్యత్వం లేనివారికి బీమా పథకంలో ఓ అవకాశం కల్పించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ తీర్మానించింది. అడ్వకేట్స్ ఫండ్లో సభ్యత్వం కోసం వయస్సువారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యేటప్పుడు న్యాయవాది నుంచి సభ్యత్వం నిమిత్తం రూ.3,500 వసూలు చేస్తుంది. 35 ఏండ్లలోపు వయసున్నవారు ఎన్రోల్ చేసుకుంటేనే ఇది వర్తిస్తుంది.
ఇప్పుడు 35 నుంచి 65 ఏండ్ల వయసున్నవారికి కూడా అవకాశం కల్పించాలని అక్టోబర్ 18న జరిగిన సమావేశంలో బార్ కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో మరణించిన న్యాయవాది కుటుంబం రూ.10 లక్షల బీమాతోపాటు వైద్య సౌకర్యాలను పొందేందుకు ఆసారం ఉంటుంది. కొత్త సభ్యులుగా చేరాలనుకునే న్యాయవాదులు డిసెంబర్ 31లోగా సభ్యత్వ రుసుం చెల్లించడంతోపాటు బార్ అసోసియేషన్ సర్టిఫికెట్ను సమర్పించాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. కొత్త సభ్యులకు 2026 జనవరి నుంచి బీమా పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు.