హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చేపట్టిన విచారణ పూర్తికాలేదని, అసంపూర్ణంగా ఉన్నదని, విచారణ జరిపేందుకు తమకు మరికొంత సమయం ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించినట్టు తెలిసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మూడు నెలల్లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ చేయాల్సి ఉన్నది. సుప్రీంకోర్టు విధించిన గడువు అక్టోబర్ 31తో ముగిసింది.
సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపు స్పీకర్ నలుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై విచారణ నిర్వహించారు. మొత్తం పదిమంది ఎమ్మెల్యేల్లో ఇంకా ఆరుగురి విచారణ నిర్వహించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల సమయం ఇవ్వాలంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు సుప్రీంకోర్టును కోరినట్టు తెలిసింది.
సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన తర్వాత స్పీకర్ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనాల్సి వచ్చిందని, దీంతో విచారణ ప్రక్రియను పూర్తిచేయలేకపోయినట్టు పేర్కొన్నారని సమాచారం. రెండు నెలల సమయం ఇస్తే విచారణ ప్రక్రియను పూర్తిచేస్తామని చెప్పినట్టు తెలిసింది.