 
                                                            Hair Problems | శిరోజాల సమస్యలు అనేవి సహజంగానే అందరికీ తరచూ వస్తూనే ఉంటాయి. ఈ సమస్యలు కొందరికి ఎల్లకాలం ఉంటాయి. జుట్టు రాలిపోవడం, బలహీనంగా మారి చిట్లడం, చుండ్రు, తలలో దురద, జుట్టు తెల్లగా మారడం వంటి అనేక సమస్యలు చాలా మందికి ఉంటాయి. వీటి నుంచి బయట పడేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలను సైతం తీసుకుంటుంటారు. అయితే ఈ సమస్యలకు గాను డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. మన ఇంట్లో పదార్థాలతోనే సహజసిద్ధంగానే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. ఆయా పదార్థాలతో పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. దీంతో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
కరివేపాకులను నీడలో ఎండబెట్టి పొడి చేయాలి. ప్రతి రోజు గ్లాసు మజ్జిగలో ఒక టీస్పూన్ కరివేపాకుల పొడి కలిపి తీసుకోవాలి. దీని వల్ల శిరోజాలు ఒత్తుగా పెరుగుతాయి. దృఢంగా ఉంటాయి. అలాగే రోజుకు ఒకటి లేదా రెండు అరటి పండ్లు తింటుండాలి. వాటిల్లో ఉండే పోషకాలు శిరోజాలను దృఢంగా మారుస్తాయి. ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. శిరోజాలు ఒత్తుగా పెరిగేందుకు గాను గుడ్లు, పాలు, పండ్లు, చేపలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే మేలు జరుగుతుంది. విటమిన్లు ఎ, డి, ఇ ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. మొలకెత్తిన శనగలు, పెసలు, పల్లీలను రోజూ తినాలి. గోధుమలు, నువ్వులను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇలా ఆయా ఆహారాలను రోజూ తీసుకుంటే జుట్ట బలంగా మారుతుంది. శిరోజాలు రాలిపోకుండా ఉంటాయి. జుట్టు ఒత్తుగా పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది.
అవిసెనూనెలో తగినంత నిమ్మరసం కలిపి జట్టుకు రాసి తరువాత రోజు తలస్నానం చేయాలి. దీని వల్ల శిరోజాలు మృదువుగా, కాంతివంతంగా మారుతాయి. అలాగే కొబ్బరినూనెలో తమలపాకు రసం కలిపి తలకు బాగా మర్దనా చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు దృఢంగా మారుతాయి. గుడ్డుసొనలో ఒక టీస్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొబ్బరినూనె కలిపి తలకు బాగా రాయాలి. ఒక గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. దీంతో జుట్టు ప్రకాశవంతంగా మారుతుంది. కుంకుడుకాయ పొడిలో గుమ్మడి కాయ విత్తనాల చూర్ణం, శీకాయ పొడి కలిపి జుట్టుకు బాగా రాయాలి. తరువాత కొంత సేపు ఆగి తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే శిరోజాలు మృదువుగా మారుతాయి. పెసరపిండి, మెంతి పిండిని నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని తలకు రుద్ది తరువాత కొంత సేపటికి తలస్నానం చేయాలి. దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
గుంటగలగరాకును కొబ్బరినూనెలో బాగా వేయించాలి. తరువాత ఆ నూనెను తలకు రాయాలి. తరచూ ఇలా చేస్తే శిరోజాలు నల్లబడుతాయి. జాజిపూలు, మందారం పువ్వులను సమపాళ్లలో తీసుకుని కషాయం కాచి దాంట్లో తగినంత కొబ్బరినూనె కలిపి మరిగించాలి. చల్లారాక ఆ నూనెతో తలకు బాగా మర్దనా చేయాలి. తరచూ ఇలా చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. కుంకుమ పువ్వును నీళ్లలో బాగా మరిగించాలి. చల్లారాక శిరోజాలకు మర్దనా చేసి కొద్ది సేపటి తరువాత నీళ్లతో తడిపితే జుట్టు ఎరుపు రంగులోకి మారుతుంది. సహజసిద్ధంగా జుట్టుకు ఈ విధంగా రంగు మార్చవచ్చు. అలాగే కప్పు మెత్తగా చేసిన గోరింట, టీస్పూన్ చొప్పున గుంటగలగరాకు, నీలి ఆకుల పొడి, మెంతి పొడి కలిపి హెన్నాలా పెట్టుకోవాలి. గంటయ్యాక స్నానం చేస్తే జుట్టుకు నల్లని రంగు వస్తుంది. ఇలా ఆయా చిట్కాలను పాటించడం వల్ల శిరోజాలకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించుకోవచ్చు. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
 
                            