సూర్యాపేట: మున్సిపాలిటీలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలు పులి రత్తమ్మ, ఆమె కూతురు జ్యోతి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ( Bollam Mallaiah Yadav ) విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ( Independence Day ) మున్సిపల్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని రత్తమ్మ ఆత్మహత్యాయత్నానికి ( Suicide Attempt ) పాల్పడటం బాధాకరమన్నారు.
కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రత్తమ్మను ఆదివారం ఆయన పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి విధుల్లో ఉన్న కార్మికుల సర్వీస్ రికార్డులను పక్కనబెట్టి, జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం వల్లే ప్రాణాలకు తెగించే పరిస్థితి వచ్చిందన్నారు.
14 ఏళ్లుగా సేవలు అందిస్తున్న కూతురు జ్యోతికి కూడా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న మున్సిపల్ యంత్రంగం, నిరుపేద కార్మికుల పొట్టకొట్టడం తగదన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని, రత్తమ్మ కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్ బాబు, గట్ల కోటేశ్వరరావు, సంపేట ఉపేందర్, బత్తుల ఉపేందర్, సోమపొంగు రాజు, మాదాల ఉపేందర్,చీమ శ్రీను, చలిగంటి లక్ష్మణ్, నేలవెల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.