2022లో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 1990లో వచ్చిన 70.8 అడుగుల వరద రికార్డును దాటి ప్రవహించింది. భద్రాచలం నీటిలోనే ఉండిపోయింది. ఇది కేవలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వరకే. ఇప్పుడు ఏపీ పోలవరం నల్లమలసాగర్ లింకు చేపట్టేందుకు సిద్ధమైంది. ఆ ప్రాజెక్టుల లక్ష్యాలు నెరవేరాలంటే ఆ మేరకు నీటి నిల్వలు పెంచుకోవాలి. సుదీర్ఘకాలం డ్యామ్‌లో నీటిని నిల్వ చేయాలి. వెరసి భద్రాచలానికి వరద సర్వసాధారణంగా మారనున్నదనేది తేలిపోతున్నది. రాముడి ఆలయం ఎల్లకాలం నీటిలో ఉండే ప్రమాదం పొంచి ఉన్నది.
Bhadrachalam | హైదరాబాద్, డిసెంబర్19 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (Godavari) వెడల్పు 1.6 కిలోమీటర్లు. అక్కడి నుంచి దిగువకు వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మొత్తంగా పాపికొండలకు చేరేసరికి గోదావరి వెడల్పు 750-800 మీటర్లకు కుంచించుకుపోతుంది. పాపికొండల దిగువ నుంచి తిరిగి సముద్రంలోకి కలిసేంత వరకు నది వెడల్పు పెరుగుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం భద్రాచలం దిగువన ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును (Polavaram Nallamala Sagar Link Project) ప్రతిపాదించడం, దానికి జాతీయహోదాను ప్రకటించడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఏర్పాటు, ఆ పనులను కేంద్రం పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు 196 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తుండగా, దాని డెడ్ స్టోరేజీ 125 టీఎంసీలు. ఇప్పటికే పాపికొండల వద్ద నది వెడల్పు తక్కువగా ఉండడంతో భారీగా వరద వచ్చిన ప్రతిసారీ వెనుకకు కొడుతుంటుంది, 2022లో వచ్చిన వరదలే అందుకు నిదర్శనం.
2022 వరదల ప్రభావం, కారణాలపై అధ్యయనానికి ఇరిగేషన్‌శాఖ ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సైతం పోలవరం నిర్మాణమే భద్రాద్రి వరదలకు ప్రధాన కారణమని తేల్చిచెప్పింది. పోలవరం నిర్మాణంతో గోదావరిలో కలిసే సుమారు 35కుపైగా వాగులు, వంకలు గతంలో మాదిరిగా కలువలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకే గతంలో కంటే తక్కువగా అంటే 22 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఎక్కువ ముంపు తీవ్రత ఏర్పడిందని కమిటీ స్పష్టం చేసింది. ఇక పోలవరం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటిని నిల్వ చేసినప్పుడు భద్రాద్రి వరకు బ్యాక్‌వాటర్ 43 అడుగుల మేరకు నిలిచి ఉంటాయని తేల్చింది. అంటే నిత్యం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే భద్రాద్రి వద్ద గోదావరి ఉంటుందని స్పష్టంగా పేర్కొంది. 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే భద్రాద్రితోపాటు, మొత్తంగా 40 వేల ఎకరాల మేరా ముంపునకు గురవుతుందని, ప్రస్తుతం 41.5 మీటర్ల వద్ద కూడా భద్రాచలం వరకు బ్యాక్‌వాటర్ విస్తరించి ఉంటుందని వెల్లడించింది.
భద్రాచలం పట్టణానికి సంబంధించి వరద నివారణకు, డ్రైనేజీ కోసం మొత్తంగా 8 తూములను ఏర్పాటు చేయగా, అందులో ఏటపాక తూము ప్రధానమైంది. భద్రాద్రిని ప్రతిసారీ వరద ముంపునకు గురిచేస్తున్నదీ ఈ తూమే. 41.5 మీటర్ల వద్ద ఈ తూము పూర్తిగా ముంపునకు గురవుతుంది. అంతేకాకుండా మిగతా ఏడు తూముల నుంచి కూడా నిరంతరం నీటిని ఎత్తి గోదావరిలో పోయాల్సి ఉంటుందని కమిటీ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో వరద నివారణకు ఏటపాక నుంచి భద్రాద్రి వరకు రక్షణ గోడలను నిర్మించాల్సి ఉంటుందని కమిటీ నివేదికలో సూచించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అప్పటికే 125 టీఎంసీల జలాలు పోలవరం వద్ద నిల్వ ఉంటాయని, ఎగువ నుంచి వచ్చే వరద దిగువకు వెళ్లేందుకు అవకాశం ఉండదని, దీంతో రోజుల తరబడి భద్రాచలం నీటి ముంపులోనే ఉండాల్సిన దుస్థితి నెలకొంటుందని ఇంజినీరింగ్ నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం ఎలాంటి ఆనకట్ట లేకున్నా భద్రాచలం వద్ద 71.9 అడుగుల మేర ప్రవహించిన గోదావరి, పోలవరం నిర్మాణం పూర్తయితే మరిన్ని అడుగులకు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గోదావరికి వచ్చిన 500 ఏండ్ల వరదల సగటును తీసుకుని తొలుత 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాసిటీతో పోలవరం ప్రాజెక్టును ఏపీ డిజైన్ చేసింది. ఫలితంగా ఉమ్మడి ఏపీలో 7 మండలాలతో పాటు మొత్తంగా 384 గ్రామాలకుపైగా ముంపు ఏర్పడుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాలను కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఏపీ విలీనం చేసుకున్నది. రాష్ట్రం ఏర్పాటు తరువాత ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను ఏపీ మార్చివేసింది. 1,000 సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుని మొత్తంగా 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచింది.
క్రెస్ట్‌గేట్లను 30 ఫీట్లకు దిగువకు దించింది. అదీగాక ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెకుల వరదకు సంబంధించి మాత్రమే పోలవరం ఎగువన ఉన్న ప్రాదేశిక ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ స్టడీని సీడబ్ల్యూసీ చేయించింది. అప్పుడు డ్యామ్ డిశ్చార్జి స్థాయిని 140 అడుగుల (42.67మీ) నుంచి 135.05 అడుగులు (41.15 మీ)కు నిర్ధారించారు. ప్రస్తుతం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెకులకు డిజైన్ చేసింది. వరద డిశ్చార్జి స్థాయిని కూడా 140 అడుగులకు వ్యతిరేకంగా 148.5 అడుగులు (45.26 మీ)గా మార్చడంతో అప్ స్ట్రీమ్‌లో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ముంపు పెరుగుతున్నది.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో కిన్నెరసాని, ముర్రేడువాగుల్లో నీరు నిలిచి ఉంటుందని, గోదావరిలో కలిసే ప్రసక్తే ఉండబోదని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. పోలవరం వద్ద 36 లక్షల వరద ప్రవాహం ఉన్నప్పుడు కిన్నెరసాని నదిలో ఎగువన 13.75 కి.మీకు, ముర్రేడువాగులో గోదావరి నుంచి 5.25 కి.మీ ఎగువ వరకు బ్యాక్‌వాటర్ నిలిచి ఉంటుందని వివరించారు. 50 శాతం డిపెండబులిటీ 25.53 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకున్నా గోదావరి నుంచి కిన్నెరసానిలో 13 కిలోమీటర్లు, ముర్రేడువాగులో 3.75 కిలోమీటర్ల బ్యాక్‌వాటర్ నిలిచి ఉంటుందని రిపోర్టు ఇచ్చింది. మొత్తంగా మారిన పోలవరం డిజైన్ ఫలితంగా అదనంగా బూర్గుంపాడు, భద్రాచలం మండలాలతో పాటు 92 గ్రామాలు ముంపునకు గురవుతాయని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలు కూడా పెరిగాయని తెలంగాణ ఇప్పటికే వాదిస్తున్నది. దిగువ గోదావరి బేసిన్లో వరుసగా వరదలు సహజం. ఈ నేపథ్యంలో సాధారణ లక్షణం వల్ల భద్రాచలం వద్ద వరద మట్టం మరింత పెరుగుతుందని, స్థానిక డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుందని గణాంకాలు సహా వివరించింది. కేంద్ర జల్‌శక్తిశాఖ సైతం తెలంగాణవాదనలతో ఏకీభవించింది.
పోలవరం ముంపు అంశంపై తెలంగాణ సర్కారు చేసిన వాదనలన్నింటితో కేంద్ర జల్‌శక్తిశాఖ, సీడబ్ల్యూసీ గతంలోనే ఏకీభవించాయి. పోలవరం బ్యాక్‌వాటర్ కారణంగా అప్‌స్ట్రీమ్‌లో అఫ్లక్స్ ఏర్పడిందని అంగీకరించాయి. గోదావరి నదికి ఇరువైపులా ఉన్న అన్ని ప్రధాన ప్రవాహాలను కవర్ చేస్తూ జాయింట్ సర్వే చేయిస్తామని, అందుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని తెలంగాణకు 2022లోనే సూచించింది. వెంటనే ఆ మేరకు జాయింట్ సర్వే చేపట్టాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి (పీపీఏ), ఏపీ ప్రభుత్వానికి సైతం కేంద్ర జలసంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఏపీతోపాటు, పీపీఏ కూడా సర్వే చేపట్టి అన్ని రక్షణ చర్యలు చేపట్టేందుకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చాయి కానీ, ఏండ్లు గడుస్తున్నా ఆ దిశగా అడుగు వేసింది లేదు. ఇటు ఏపీ, అటు పీపీఏ ఆది నుంచీ తాత్సారం చేస్తున్నాయి. ఒకదశలో సర్వే చేసేదే లేదని తేల్చిచెప్పాయి. దీంతో మళ్లీ సీడబ్ల్యూసీనే జోక్యం చేసుకుని ఉమ్మడి సర్వే పూర్తికి నియమిత కాలపరిమితి విధిస్తూ పీపీఏకు అల్టిమేటం జారీ చేసింది.
పోలవరంతోనే ముంపు సమస్య వెంటాడుతుండగా ఇప్పుడు ఏపీ సర్కారు కొత్తగా చేస్తున్న ప్రతిపాదనలతో మరింత ప్రమాదం నెలకొన్నదని ఇంజినీర్లు వెల్లడిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు లక్ష్యం 90 నుంచి 120 రోజుల్లో గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను పోలవరం -ప్రకాశం బరాజ్ – బొల్లాపల్లి – బనకచర్ల లేదంటే నల్లమలసాగర్‌కు తరలించడం. అదీగాక ఇప్పటికే పోలవరం నుంచి 80 టీఎంసీలను మళ్లిస్తున్నది. మొత్తంగా 280 టీఎంసీలను పోలవరం కుడికాలువ నుంచే వినియోగించుకునేందుకు ఏపీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇది తాత్కాలికమే.
భవిష్యత్‌లో 400 టీఎంసీలను వినియోగించుకుంటామని కూడా చెబుతున్నది. వీటికి అదనంగా పోలవరం ఎడమ కాలువ నీటి వినియోగాలు కూడా ఉన్నాయి. ఏపీ ఆ మేరకు జలాలను వినియోగించుకోవాలంటే పోలవరం డ్యామ్‌లో నీటిని నిల్వ చేయాల్సిందే. వర్షాకాలం, వరదల సమయంలో నీటి మళ్లింపు అసాధ్యం. ఆ తరువాత ప్లాన్ ప్రకారం ఏపీ నీటిని మళ్లించుకోవాలంటే నిర్దిష్టంగా 120 రోజులకు ఎక్కువగానే పోలవరం నిర్దేశిత లెవల్ (41.5 మీటర్లు) వరకు నీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది. అంటే భద్రాద్రికి ఎప్పుడూ ముంపు పొంచి ఉన్నట్లేనని స్పష్టంగా తెలిసిపోతున్నది. పీఎన్ లింకుతో భద్రాద్రి ముంపు మరింత పెరిగే అవకాశమూ ఉందని అధికారులు చెబుతున్నారు.
తొలుత తెలంగాణ, ఏపీలతో సమావేశం నిర్వహించాలని, ముంపుపై ఇరు రాష్ర్టాలు గతంలో చేసిన అధ్యయనాలు, రూపొందించిన మ్యాపులపై చర్చించాలని జలసంఘం దిశానిర్దేశం చేసింది. అనంతరం ఉమ్మడి సర్వేను సత్వరమే చేపట్టాలని నొక్కిచెప్పింది. ఏపీ సహకరించకపోయినా తెలంగాణతో కలిసి సర్వే నిర్వహించాలని, ఆ బాధ్యత పీపీఏదేనని తేల్చిచెప్పింది. సీడబ్ల్యూసీ అల్టిమేటం జారీ చేయడంతో పీపీఏ, ఏపీ ఆ మధ్య కొంత హడావుడి చేసి, జాయింట్ సర్వేకు ప్రత్యేకంగా అధికార బృందాన్ని కూడా నియమించాయి. సర్వే నిర్వహణకు అనుకూలమైన తేదీలను తెలియజేయాలని తెలంగాణకు సమాచారం అందించి, తీరా సర్వే చేసేందుకు వచ్చిన ఏపీ మళ్లీ పేచీ పెట్టింది.
తెలంగాణ డిమాండ్ల మేరకు సర్వే చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని, కేవలం గతంలో బూర్గుంపాడు వరకు తేల్చిన ముంపు వరకే సర్వే చేస్తామంటూ కొర్రీ పెట్టి నిలిచిపోయేలా చేసింది. సీడబ్ల్యూసీ సూచించిన మేరకు సర్వే చేయడం కుదరదని, ఒకవేళ చేస్తే జాతీయ ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని కొత్తవాదానికి తెరలేపి అసలు విషయాన్ని అటకెక్కించింది.
ఇటీవల నిర్వహించిన పీపీఏ సమావేశంలో మరోసారి సర్వే విషయమై చర్చించారు. అందుకోసం ప్రత్యేకంగా కమిటీ వేస్తామని చెప్పిన పీపీఏ ఇప్పటికీ నెల దాటినా ఊసే ఎత్తడం లేదు. ఆ దిశగా కేంద్రం, పీపీఏ, ఏపీ సర్కారుపై ఒత్తిడి తీసుకురావడంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైంది. లేఖలు రాసి చేతులు దులుపుకోవడం తప్ప మరేమీ చేయని దుస్థితి నెలకొన్నది. తాజాగా పీఎన్ లింకు ప్రాజెక్టు చేపడితే మరింతగా ముంపు పెరిగే అవకాశమున్నదనే ఆందోళన అంతకంతకు పెరుగుతూనే ఉన్నది.