Justice Sridevi | హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ జీ శ్రీదేవికి న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆమెకు పెన్షన్ మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని హైకోర్టు (High Court) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 అక్టోబర్‌లో పదవీ విరమణ చేసిన జస్టిస్ శ్రీదేవికి ఇంకా పెన్షన్ మంజూరు కాకపోవడంతో ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌పై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున లాయర్ పైడా ప్రతీక్‌రెడ్డి వాదన వినిపిస్తూ.. జస్టిస్ శ్రీదేవి పదవీ విరమణ చేసి మూడేైండ్లెనా అధికారులు పెన్షన్ మంజూరు చేయలేదని తెలిపారు. పెన్షన్ బకాయిలతోపాటు ఇతర ప్రయోజనాలను వడ్డీ సహా చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. జస్టిస్ శ్రీదేవికి పెన్షన్ మంజూరు చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ నాటికి వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది.