భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. తలసీమియా వ్యాధితో ఐదుగురు పిల్లలకు హెచ్ఐవీ సోకిన రక్త మార్పిడి జరిగింది. సాత్నాలోని ప్రభుత్వ దవాఖానలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మూడు వేర్వేరు బ్లడ్ బ్యాంకుల నుంచి తెచ్చిన 189 యూనిట్ల రక్తాన్ని ఈ పిల్లలకు ఎక్కించారు. 150 మందికి పైగా దాతల నుంచి ఈ రక్తాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. దాతల నుంచి రక్తాన్ని సేకరించటంలో నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసినట్లు ఈ ఘటన నిరూపిస్తోంది.
ఈ ఘటనకు బాధ్యులైన బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సస్పెండ్ చేసింది. సాత్నా జిల్లా దవాఖాన మాజీ సివిల్ సర్జన్ డాక్టర్ మనోజ్ శుక్లాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రభుత్వం నియమించిన ఏడుగురు సభ్యుల విచారణ కమిటీ ఇచ్చిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు.