న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని రాష్ర్టాల్లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సర్ తర్వాత డీఎంకే పాలిత తమిళనాడులో 97 లక్షలకు పైగా ఓటర్లను తొలగించినట్టు, అందులో ఒక్క చెన్నైలోనే 14.25 లక్షల ఓట్లు ఉన్నట్టు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అర్చనా పట్నాయక్ శుక్రవారం వెల్లడించారు. సర్ తర్వాత తమిళనాడులో ఓటర్ల సంఖ్య 5,43,76,755గా ఉందని ఆమె వివరించారు. సర్కు ముందు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6.41 కోట్లని చెప్పారు. పాత జాబితాలోని 97,37,832 ఓటర్ల పేర్లను తొలగించామన్నారు.
ఇందులో 26.94 లక్షల మంది మరణించగా, 66.44 లక్షల మంది శాశ్వతంగా వలస లేదా వేరే ప్రాంతానికి వెళ్లిపోయారని, 3,39,278 ఓట్లు డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నాయన్నారు. సర్ అనంతరం ఈసీ విడుదల చేసిన ముసాయిదా జాబితాపై అధికార డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతకు ముందు బీహార్ రాష్ట్రంలో కూడా కేంద్రం ఇదే చిట్కాను ప్రయోగించి లక్షలాది మంది నిజమైన ఓటర్లను తొలగించిందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు.
బీజేపీ పాలిత గుజరాత్లో సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత 74 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.అలాగే మధ్యప్రదేశ్లో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 42 లక్షల మంది ఓటర్లను తొలగించారు. దీంట్లో 22.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు తరలిపోగా, 8.4 లక్షల మంది మరణించారు. 2.5 లక్షల మందికి రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి. 8.4 లక్షల మంది ఆబ్సెంట్ ఓటర్లు ఉన్నారు.