జనగామ చౌరస్తా, చిట్యాల, డిసెంబర్ 19: జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం కొడకండ్ల మండలం నీలిబండ తండావాసులు ధర్నా చేపట్టారు. సర్పంచ్ ఎన్నిక ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, రీ కౌంటింగ్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నీలిబండ తండాలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి వాంకుడోత్ సురేష్, రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీనాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 17న పోలింగ్‌లో మొత్తం 760 ఓట్లకుగాను 714 ఓట్లు పోలైనట్టు వెల్లడించారు. ఇందులో సురేశ్‌కు 378 ఓట్లు, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థికి 333 ఓట్లు, ఇతరులకు 3 ఓట్లు రాగా, 45 ఓట్ల మెజార్టీతో వాంకుడోత్ సురేశ్ గెలిచినట్టు ఆర్వో ప్రకటించారని తెలిపారు. ప్రత్యర్థి సర్పంచ్ అభ్యర్థి తన ఓటమిని అంగీకరించి సురేష్‌కు శుభాకాంక్షలు తెలిపి బయటికి వెళ్లిన సమయంలో కౌంటింగ్ హాల్లో కొద్దిసేపు కరెంట్ పోయిందని చెప్పారు. ఆ తర్వాత ఎవరూ అడగకున్నా ఆర్వో రీకౌంటింగ్ నిర్వహించి, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి 5 ఓట్ల మెజార్టీతో సురేశ్‌పై గెలిచినట్టు ప్రకటించారని తెలిపారు.
చిట్యాలలో బీఆర్ఎస్ ధర్నా
జయశంకర్భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం అందుకుతండాలో ఈ నెల 14న జరిగిన ఓట్ల లెక్కింపుపై రీకౌంటింగ్ చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం అందుకుతండాలో ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి దాసరి మమతాతిరుపతి 6 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని, రీ కౌంటింగ్ చేయాలని అధికారులకు విన్నవించినా లెక్కించలేదని చెప్పారు.
పోలింగ్‌లో అవకతవకలు!

కురవి, డిసెంబర్ 19 : సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి శివారు బిల్యానాయక్ తండా గ్రామ పంచాయతీ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఈ నెల 17న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోలింగ్ అధికారులు ఓటర్ల చేతి వేళ్లకు ఇంకు పెట్టకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, దీంతో కొంతమంది రెండు సార్లు ఓట్లు వేశారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము ఓటమి పాలయ్యామని, తమకు న్యాయం చేయాలని కోరారు.
ఆ మూడు ఓట్లు ఏమయ్యాయి?
చెన్నూర్ రూరల్, డిసెంబర్ 19: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం బావురావుపేట గ్రామ పంచాయతీలో ఈ నెల 17న జరిగిన సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మూటు ఓట్ల గల్లంతుపై స్వతంత్ర అభ్యర్థి మద్దతు దారులు చెన్నూర్‌లో శుక్రవారం ఎంపీడీవో మోహన్‌తో వాగ్వాదానికి దిగారు. అనంతరం చెన్నూర్ -మంచిర్యాల ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. స్వతంత్ర అభ్యర్థి పబ్బ జ్యోతిపై కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తాటి శ్రీనివాస్‌గౌడ్ రెండు ఓట్లతో తేడాతో విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు. గ్రామపంచాయతీలో మొత్తం 803 ఓట్లు ఉండగా 738 పోలయినట్లు చూపించారు. స్వతంత్ర అభ్యర్థి జ్యోతికి 355 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి తాటి శ్రీనివాస్‌కు 357 ఓట్లు వచ్చినట్లు, ఇందులో 15 చెల్లనివి ఓట్లు, 8 నోటాకు వచ్చినట్టు చూపించారు. మొత్తం ఓట్లు కలిపితే 735 మాత్రమే వస్తున్నాయి. ఇంకా మూడు ఓట్లు ఏమయ్యాయని స్వతంత్ర అభ్యర్థి, మద్దతు దారులు ఆందోళన చేపట్టారు. చెన్నూర్ సీఐ దేవేందర్‌రావు, ఎస్సైలు సుబ్బారావు, శ్యాం పటేల్ నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కలెక్టర్, ఆర్డీవో, హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు.
సోమార్పేట దాడి’ నిందితులపై చర్యలు తీసుకోవాలి

ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 19: కామారెడ్డి జిల్లా సోమార్పేటలో ఈ నెల 15న జరిగిన ‘ట్రాక్టర్ దాడి’కి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ఎల్లారెడ్డి బంద్ విజయవంతమైంది. అఖిలపక్షం నాయకులు అంబేద్కర్ చౌరస్తా నుంచి శివాజీచౌక్ వరకు భారీర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీవో పార్థసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సోమార్‌పేట్‌లో ఈ నెల 15న జరిగిన ట్రాక్టర్ దాడికి కారణమైన సర్పంచ్ పాపయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిబాబాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ దాడిలో ఐదుగురికి గాయాలుకాగా, ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.