న్యూఢిల్లీ: ఓ మహిళా డాక్టర్ హిజాబ్‌ను తొలగించి వివాదంలో చిక్కుకున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ చర్యను మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ సహా పలు పశ్చిమాసియా దేశాలు ఖండించాయి. ఇది మహిళల గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ, ఉనికిపై దాడిగా ఆమ్నెస్టీ అభివర్ణించింది. ఇంత విమర్శలు ఎదురవుతున్నా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గట్టిగా సమర్థించారు.
గురువారం ఆయన స్పందిస్తూ నియామక పత్రాన్ని స్వీకరించేందుకు వచ్చిన వ్యక్తి తన ముఖాన్ని చూపించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మనమేమైనా ఇస్లామిక్ దేశంలో ఉన్నామా? ప్రజలు పాక్ గురించి మాట్లాడుతారు. కాని ఇది భారత్. ఇక్కడి చట్టాల ప్రకారమే నడుచుకోవాలి.
నితీశ్ మంచి పనే చేశారు అంటూ ముఖ్యమంత్రిని గిరిరాజ్ గట్టిగా సమర్థించారు. బాధిత మహిళ ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరస్కరించినట్లు వచ్చిన వార్తలను విలేకరులు ప్రస్తావించగా, ఆమె ఉద్యోగాన్ని తిరస్కరిస్తుందో లేక గంగలో దూకుతుందో అది ఆమె ఇష్టం అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.