న్యూఢిల్లీ: కోరింత దగ్గు వల్ల చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. గర్భిణులు టీకాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. కోరింత దగ్గుతో బాధపడేవారు ఊపిరి పీల్చుకునేటపుడు పెద్ద శబ్దంతో దగ్గు వస్తుంది. పెద్దలు, పిల్లలకు ఇది కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. ఇది అత్యంత తీవ్రమైన అంటురోగం.
చికాగోలోని ఆన్ అండ్ రాబర్ట్ హెచ్ లురీ పిల్లల దవాఖానలో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న కెయిట్లిన్ లీ ఈ అధ్యయనానికి లీడ్ ఆథర్. శిశువుల్లో కోరింత దగ్గు లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయని కెయిట్లిన్ చెప్పారు. గర్భిణులకు కోరింత దగ్గు టీకాను ఇవ్వడం చాలా అవసరమని కెయిట్లిన్ చెప్పారు. దీనివల్ల నవజాత శిశువులకు ఈ వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందన్నారు. ది యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సిఫారసుల ప్రకారం, ఈ టీకాలను 2, 4, 6, 15-18 నెలలు; 4-6 సంవత్సరాల వయసులో ఇవ్వాలని ఆయన సూచించారు.