న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలను నిలిపివేయకపోతే పాకిస్థాన్‌ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెడతామని భారత ఆర్మీ చీఫ్ చేసిన హెచ్చరికపై పాకిస్థాన్ స్పందించింది. భవిష్యత్తులో తమపై సైనిక దాడులకు పాల్పడితే భారతదేశానికి చెందిన యుద్ధ విమానాల శకలాల కిందనే ఆ దేశాన్ని భూ స్థాపితం చేస్తామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆదివారం హెచ్చరించారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ పాకిస్థాన్ తన ఉగ్రవాద ప్రాయోజిత చర్యలను నిలిపివేయాలని ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు.
దీనిపై ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ హెచ్చరికలను భారతదేశ అత్యున్నత భద్రతా వ్యవస్థ నుంచి వచ్చిన కవ్వింపు ప్రకటనలుగా అభివర్ణించారు. ఈ ఏడాది మేలో జరిగిన ఘర్షణలలో ఓటమి పాలైన భారత్ పోయిన తన పరువును పునరుద్ధరించుకునేందుకు భారతీయ సైనిక, రాజకీయ నాయకులు చేసిన విఫల యత్నంగా వారు చేసిన తాజా ప్రకటనలని ఆయన వ్యాఖ్యానించారు. 0-6 స్కోరుతో ఓటమిపాలైన భారత నాయకులు మరోసారి అటువంటి ప్రయత్నం చేస్తే ఈసారి స్కోరు మరింత పెరుగుతుందని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ 0-6 స్కోరు గురించి ఆయన విశదీకరించలేదు.