న్యూఢిల్లీ, అక్టోబర్ 5: కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో అలజడి చెలరేగిన అనంతరం అరెస్టయి జోధ్‌పూర్ జైలులో ఉన్న వాతావరణ పరిరక్షణ ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్ ప్రశాంతంగా, సమైక్యంగా ఉండాలని లద్దాఖ్ ప్రజలకు పిలుపునిస్తూ ఓ లేఖ రాశారు. రాష్ట్ర హోదా కోసం గాంధేయ సిద్ధాంతమైన అహింసా మార్గంలో తమ పోరాటాన్ని కొనసాగించాలని ఆ లేఖలో పిలుపునిచ్చారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండు చేస్తూ సెప్టెంబర్ 25న నిరసనకారులు ఆందోళన చేపట్టగా హింసాకాండ చెలరేగి లెహ్ పట్టణంలో నలుగురు మరణించడంతో జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్‌చుక్‌ని ఎన్ఐఏ అరెస్టు చేసి జోధ్‌పూర్ జైలుకు తరలించింది. కాగా, జాతీయ భద్రతా చట్టం కింద తన భర్తను అక్రమంగా నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజారియాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనున్నది.