చెన్నై, అక్టోబర్ 5: కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే అధినేత విజయ్ ప్రచార వాహనం డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ ఉపయోగించిన ప్రచార బస్సుపైనా ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకోగా, 41మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన యావత్ దేశాన్ని షాక్‌కు గురి చేసింది. నటుడు విజయ్ ఉపయోగించిన ప్రచార బస్సు కరూర్ ర్యాలీకి సమీపంలో రెండు మోటార్ సైకిళ్లను ఢీ కొన్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో ప్రసారమయ్యాయి. దీనిపై స్పందించిన మద్రాస్ హైకోర్టు పోలీసుల నిష్క్రియాపరత్వంపై ఆందోళన వ్యక్తం చేసింది.
కరూర్‌లో టీవీకే చీఫ్ విజయ్ ప్రచార ర్యాలీలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ‘సిట్’ దర్యాప్తు ఆదివారం మొదలైంది. సిట్‌లో తనతోపాటు మరో ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారులు సహా 11మంది పోలీసు అధికారులు ఉన్నారని సిట్ ప్రధాన అధికారి గార్గ్ చెప్పారు. ఘటనాస్థలాన్ని సిట్ అధికారులు పరిశీలించారు.