చేతనమైన
చేతిలోని కర్ర
జడత్వాన్ని జారవిడిచి
జంగమమై తిరుగుతుంది
ఎంత గుంపులో ఉన్న మనిషినైనా
గొంతు విని గుర్తుపట్టి
పేరు పెట్టి పిలిచి
పెద్ద సుట్టం చేసుకుంటుంది
మాటల మర్మాన్ని పసిగట్టి
ఎక్కడ తగ్గాలో
ఎక్కడ నెగ్గాలో
అంచనా కట్టి
పడే అడుగులు
స్వరతంత్రులు
మంత్రముగ్ధులను చేసే
గాన వాహినులు
పంచమం పరవశిస్తుంది
దైవతం దారమై
పువ్వులను పొదుగుకొని
పారే ఏరు
మతి మరుపును
దరి చేరనీయని ధారణ
నాలుక వేదిక మీద
శకలాలు శకలాలుగా
తవ్విపోసిన అనుభవాల గనులు
స్పర్శలిపి నేర్చిన సర్వాంగులు
మెదడును మేల్కొల్పే
మునివేళ్ళు ముద్దాడిన బ్రెయిలీ
డీలాపడి లొంగిపోయే
డెస్కుటాపు, కీ బోర్డు, ప్రింటర్
కల్లోలాలను ఎదిరించి
కాలాన్ని జయించిన సంకల్పం…
– కందుకూరి అంజయ్య 94902 22201