గంభీరావుపేట, మార్చి 1 : సొంతిల్లు లేని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను సర్కారు మంజూరు చేసినా.. సకాలంలో బిల్లులు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కోట ఎల్లవ్వ రెండు బిల్లులు రాక ఆరు నెలల సంది ఎదురుచూస్తున్నది. గతేడాది మేలో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని కలెక్టర్ ప్రోసీడింగ్ అందించడంతో ఆమె సంబురపడ్డది. జూన్లో ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టింది. మొదటిసారి బేస్మిట్ పూర్తి చేసిన రెండు నెలల తర్వాత లక్ష రూపాయలు బిల్లు మంజూరైంది. తర్వాత కూడా బిల్లులు వస్తాయనే ఆశతో ఎల్లవ్వ ఆరు లక్షల వరకు అప్పులు తెచ్చింది.
ఆగస్టులోనే గోడలు పూర్తి చేసింది. అక్టోబర్లో స్లాబ్ వేయించింది. ప్లాస్టరింగ్ కూడా పూర్తి చేయించింది. అయితే ఆరు నెలలు గడిచినా మూడు లక్షల బిల్లులు రాక నిరాశతో ఎదురుచూస్తున్నది. ఎలాగైనా బిల్లులు వస్తాయనే నమ్మకంతోనే అప్పులు తెచ్చి పనులు పూర్తి చేయించానని ఎల్లవ్వ చెబుతున్నది. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని వాపోతున్నది. ఇంటి పనులు చివరి దశకు చేరాయని, త్వరగా బిల్లులు ఇప్పించాలని వేడుకుంటున్నది. ఈ విషయమై గంభీరావుపేట మండల హౌసింగ్ ఏఈ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల వద్ద పెండింగ్లో ఉందని, త్వరలోనే పరిష్కారమవుతుందని చెప్పారు.