Mediterranean Diet | ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలని ప్రస్తుతం చాలా మంది అనేక రకాల డైట్లను పాటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల డైట్లకు ప్రస్తుతం ఆదరణ పెరుగుతోంది. అయితే కొన్ని రకాల డైట్లు మనకు ఎంతో పురాతన కాలం నుంచే అందుబాటులో ఉన్నాయి. వాటిని పలు దేశాలకు చెందిన ప్రజలు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. అలాంటి డైట్లలో మెడిటరేనియన్ డైట్ కూడా ఒకటి. మెడిటరేనియన్ సముద్రానికి సమీపంలో ఉన్న ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలకు చెందిన వాసులు ఈ డైట్‌ను ఎక్కువగా పాటిస్తారు. ఆయా ప్రాంతాలను మెడిటరేనియన్ ప్రాంతాలుగా పిలుస్తారు. అందుకనే ఈ డైట్‌కు ఆ పేరు వచ్చింది. ఈ డైట్ ఎంతో కాలం నుంచి ప్రాచుర్యంలో ఉంది. మెడిటరేనియన్ డైట్ ను పాటించడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అనేక పోషకాలను సైతం పొందవచ్చు. ఈ డైట్‌ను పాటిస్తే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు.
మెడిటరేనియన్ డైట్ లో ప్రధానంగా ఆలివ్ ఆయిల్ వాడకం అధికంగా ఉంటుంది. ఇతర నూనెలను ఇందులో ఉపయోగించరు. ఆలివ్ నూనెను వాడుతారు కాబట్టి ఈ డైట్ ఎంతో ఆరోగ్యకరమని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఈ డైట్లో భాగంగా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, పాస్తా, బీన్స్ వంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారాలను రోజూ తింటారు. అలాగే చేపలు, ఇతర సముద్రపు ఆహారాలు, పౌల్ట్రీ, పాల ఉత్పత్తులను రోజూ ఒక మోస్తరుగా తీసుకోవాలి. వీటిని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఆలివ్ ఆయిల్‌ను కూడా రోజూ కొద్దిగా తీసుకోవాలి. ఈ డైట్లో భాగంగా మటన్ వంటి రెడ్‌మీట్, స్వీట్లను తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. లేదా మానేయాలి. వీటిని నెలకు ఒకసారి మాత్రమే అది కూడా కొద్దిగానే తీసుకోవాలి. ఇలా మెడిటరేనియన్ డైట్ ను పాటించాల్సి ఉంటుంది.
మెడిటరేనియన్ డైట్ లో భాగంగా రోజూ తినే ఆహారంలో 40 శాతం పిండి పదార్థాలు, 40 శాతం కొవ్వులు, 20 శాతం ప్రోటీన్లు లభించేలా చూసుకోవాలి. ఈ డైట్‌ను పాటించే వారు ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారని గతంలో పలువురు సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. అందుకనే మెడిటరేనియన్ డైట్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. అయితే కీటో డైట్ ప్రాచుర్యంలోకి వచ్చినప్పటి నుంచి మెడిటరేనియన్ డైట్ ను పాటించడం తగ్గించారు. కానీ మెడిటరేనియన్ డైట్ మనకు ఎన్నో లాభాలను అందిస్తుంది. మెడిటరేనియన్ డైట్ లో భాగంగా తృణ ధాన్యాలు, బీన్స్, పప్పులు, నట్స్, సీడ్స్, కూరగాయలు, పండ్లు, ఆలివ్ ఆయిల్‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. చేపలు, ఇతర సీఫుడ్, పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, చికెన్, చీజ్, నెయ్యి, పనీర్‌ను వారంలో ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవచ్చు. మటన్, బీఫ్, స్వీట్లను నెలకు ఒకసారి మాత్రమే తినాలి.
మెడిటరేనియన్ డైట్‌ను పాటించడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ డైట్‌ను పాటిస్తుంటే శరీర శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గుతాయి. శారీరక శ్రమ, వ్యాయామం చేసేవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ డైట్‌ను పాటిస్తే వృద్ధాప్యంలో అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తేల్చారు. మెడిటరేనియన్ డైట్ ను పాటించే వారి ఆయుర్దాయం సహజంగానే ఇతర దేశాల వారితో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆయా దేశాలకు చెందిన వారు ఎక్కువ కాలం పాటు జీవిస్తారని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ డైట్‌ను పాటిస్తుంటే బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు. ఇలా మెడిటరేనియన్ డైట్ వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.