Jowar Roti | పూర్వకాలంలో చాలా మందికి జొన్నలే ప్రధాన ఆహారంగా ఉండేవి. తెల్ల అన్నాన్ని ఎప్పుడో పండుగలు, శుభ కార్యాల సమయంలోనే తినేవారు. జొన్నలను రోజూ తినేవారు కనుకనే ఒకప్పుడు ప్రజలు అంత ఆరోగ్యంగా ఉండేవారు. వృద్దాప్యం వచ్చినా కూడా కీళ్ల నొప్పులు, షుగర్, బీపీ వంటి సమస్యలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు అంతా జంక్ ఫుడ్ యుగం అయిపోయింది. చిన్న వయస్సులోనే అనేక రోగాలు చుట్టు ముడుతున్నాయి. కానీ ఆరోగ్యకరమైన ఆహారం తింటే అసలు ఇలాంటి రోగాలు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా జొన్నలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. అయితే జొన్నలతో తయారు చేసే రొట్టెలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని రోజూ తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పలు వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చు.
జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉండేలా చేస్తుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. అలాగే ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అజీర్తి ఉండదు. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. జొన్నలను తింటే ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. దీని వల్ల బరువు తగ్గడం సులభతరం అవుతుంది. జొన్న రొట్టెలను రోజూ తింటుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. జొన్నల గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ చాలా తక్కువగా ఉంటుంది. కనుక జొన్న రొట్టెలను తింటే షుగర్ లెవల్స్ వెంటనే పెరగవు. పైగా జొన్నల్లో ఉండే ఫైబర్ కారణంగా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు జొన్న రొట్టెలను రోజూ తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. కనుక గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు సైతం జొన్నలను సులభంగా తినవచ్చు. దీంతో అలర్జీలు వస్తాయన్న భయం చెందాల్సిన అవసరం లేదు. జొన్నల్లో అనేక రకాల బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. నియాసిన్, థయామిన్, రైబోఫ్లేవిన్ లతోపాటు ఐరన్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. బి విటమిన్ల వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. నాడీ మండల వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. మెదడు యాక్టివ్గా మారుతుంది. చురుగ్గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. బద్దకం పోతుంది. జొన్నల్లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. వీటిల్లోని మెగ్నిషియం కండరాలను ప్రశాంతంగా మారుస్తుంది. దీంతో కండరాల నొప్పులు తగ్గిపోతాయి. జొన్నల్లోని ఫాస్ఫరస్, క్యాల్షియం ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి.
జొన్నలతో అనేక రకాల వంటకాలను తయారు చేయవచ్చు. కానీ రొట్టెలు ఎంతో రుచిగా ఉంటాయి. జొన్న రొట్టెల తయారీకి వాడే పిండిలో కొద్దిగా పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు వంటివి వేసి రొట్టెలను తయారు చేసి తింటే ఎంతో రుచిగా ఉండడమే కాదు, ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. జొన్న రొట్టెలను తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే ప్రణాళికలో ఉన్నవారు రోజూ ఒక జొన్న రొట్టెను రాత్రి పూట తింటుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. సాధారణంగా రొట్టె పెద్దగా ఉంటే ఒకటి తింటే సరిపోతుంది. మీడియం సైజ్లో ఉంటే రెండు రొట్టెలను తినవచ్చు. ఒక జొన్న రొట్టెను తింటే సుమారుగా 50 క్యాలరీల శక్తి లభిస్తుంది. జొన్నరొట్టె తయారీకి నూనెను ఎక్కువగా ఉపయోగించకూడదు. నెయ్యి వాడితే మేలు జరుగుతుంది. ఇలా జొన్న రొట్టెలను తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.