Metabolism | అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుతం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. అధికంగా ఉన్న బరువు తగ్గేందుకు చాలా మంది నానా తంటాలు పడుతున్నారు. అందుకు గాను వ్యాయామాలు చేయడం, డైట్ పాటించడం, సరైన ఆహారాలను తీసుకోవడం వంటి పనులు చేస్తున్నారు. అయితే ఇవి మాత్రమే కాదు, మన శరీర మెటబాలిజం కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కానీ చాలా మందికి అసలు మెటబాలిజం గురించి తెలియదు. మెటబాలిజం అంటే మన శరీరంలో జీవక్రియలు నిర్వహించబడే రేటు అన్నమాట. ఈ రేటు సరిగ్గా ఉంటేనే మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి. క్యాలరీలు సరిగ్గా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. కనుక మన శరీరం మెటబాలిజంను పెంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకు గాను కొన్ని రకాల ఆహారాలు మనకు ఎంతగానో దోహదం చేస్తాయి.
మన శరీర మెటబాలిజంను పెంచి క్యాలరీలు ఖర్చయ్యేలా చేసేందుకు గాను మిర్చి ఎంతగానో సహాయం చేస్తుంది. మిర్చిని మనం ఎలాగైనా తినవచ్చు. పచ్చి మిర్చి లేదా ఎండు మిర్చిని తినవచ్చు. మిరపకాయల్లో క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కనుక మిర్చిని తింటే మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. రోజూ కనీసం 3 గ్రాముల మోతాదులో అయినా మిర్చిని తింటుండాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. ఇక మన శరీర మెటబాలిజంను పెంచే ఆహారాల్లో గ్రీన్ టీ కూడా ఒకటి. ఇందులో ఫ్లేవనాయిడ్స్, కెఫీన్ ఉంటాయి. ఇవి మెటబాలిజంను మెరుగు పరుస్తాయి. దీంతో క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో అధికంగా ఉండే ద్రవాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో బరువు గణనీయంగా తగ్గుతారు. రోజుకు కనీసం 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీని తాగుతుంటే ఫలితం ఉంటుంది.
మెటబాలిజంను పెంచేందుకు గాను దాల్చిన చెక్క కూడా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. దీని వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. శరీరంలో కొవ్వు చేరదు. షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని కలిపి రాత్రి పూట నిద్రకు ముందు తాగవచ్చు. లేదా దాల్చిన చెక్క పొడిని సలాడ్స్, జ్యూస్‌లలో కలిపి తీసుకోవచ్చు. లేదా ఈ పొడిని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. ఇలా దాల్చిన చెక్కను తీసుకుంటే శరీర మెటబాలిజంను పెంచుకోవచ్చు. దీని వల్ల క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
అల్లంలో జింజరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. చెమట వచ్చేలా చేస్తుంది. శరీర మెటబాలిజం పెరిగేలా చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. రోజూ భోజనానికి ముందు రెండు పూటలా ఒక టీస్పూన్ అల్లం రసం సేవిస్తుంటే ఫలితం ఉంటుంది. లేదా అల్లం ముక్కను నోట్లో వేసుకుని నేరుగా నమిలి తినవచ్చు. అల్లాన్ని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను కూడా తాగవచ్చు. దీని వల్ల మెటబాలిజం పెరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. మిరియాలను తీసుకుంటున్నా కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. పాలలో మిరియాల పొడి కలిపి తాగవచ్చు. అలాగే మెటబాలిజంను పెంచేందుకు ఉసిరిక పొడి, పసుపు కూడా మేలు చేస్తాయి. ఇలా ఆయా ఆహారాలను తీసుకుంటే మెటబాలిజంను పెంచుకోవచ్చు. దీని వల్ల క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. బరువు సులభంగా తగ్గుతారు.