గ్రోక్ పనితీరు ఎలా ఉండాలన్న దానిపై సదరు ఏఐ చాట్‌బాట్ టీమ్‌కు మస్క్ ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్ చెప్పలేకపోయే ఘాటైన, తిరకాసు ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చేలా ఈ గ్రోక్‌ను తయారుచేసినట్టు మస్క్ రూపకర్తల బృందం ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు కేవలం వాస్తవాలను మాత్రమే చెప్పాలంటూ ఈ చాట్‌బాట్‌కు రూపకర్తలు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దానితోపాటు కాస్త హాస్యాన్ని మేళవించి సరదా సంభాషణలతో ఆసక్తికర సమాధానాలు ఇవ్వాలని గ్రోక్‌ను ట్రెయిన్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓపెన్ఏఐకి చెందిన చాట్ జీపీటీ, గూగుల్‌కు చెందిన జెమిని, చైనాకు చెందిన డీప్‌సీక్ తమ రూపకర్తలకు సంబంధించిన అంశాలు, దేశానికి సంబంధించిన విషయాలపై ఆచితూచి సమాధానాలను ఇస్తున్నాయి. ప్రతికూల సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, ఆ ప్రశ్నను విస్మరిస్తున్నాయి. అయితే, ఇందుకు ‘గ్రోక్’ భిన్నంగా ప్రవర్తిస్తున్నది. ‘గ్రోక్’ ఇస్తున్న సమాధానాలు సెన్సార్ లేనివిగా పలువురు అభిప్రాయపడుతున్నారు.