రుద్రూర్(వర్ని), ఫిబ్రవరి 23: మహిళా న్యాయవాదిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం రుద్రూర్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. మహిళా న్యాయవాదికి న్యాయం జరగని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివారం రుద్రూర్లో కొంత మంది వ్యక్తులు ఓ బాలుడిపై దాడి చేస్తుండడాన్ని చూసి, ఎం దుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు తనను అసభ్యకరంగా దూషిస్తూ, దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఈ సందర్భంగా వాపోయారు.
ఆరా తీసిన సీపీ..
న్యాయవాదిపై దాడి జరిగిన రుద్రూర్లోని జేఎస్సీ కాలనీని పోలీసు కమిషనర్ సాయి చైతన్య సోమవారం సందర్శించారు. ఆదివారం రాత్రి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్థానిక పాఠశాలకు సీపీ వెళ్లి అక్కడి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఆయన వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న తదితరులు ఉన్నారు.