కామారెడ్డి(మాచారెడ్డి), ఫిబ్రవరి 23: రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నాయకులు డిగ్రీ కళాశాల ఆస్తుల వివాదాన్ని తెర పైకి తీసుకొచ్చారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నా రు. సోమవారం ఆయన కలెక్టర్ అశీష్ సంగ్వాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. 263 ఎకరాల భూమిలో 1964 నుంచి ఇప్పటి వరకు ఏ భవనానికి ఎంత స్థలం కేటాయించారు. ప్రజా ప్రయోజనాల కోసం చేశారా.. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం చేశారా? అనేది నిగ్గు తేల్చాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు. డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో తాను, తన తండ్రి ఏ తప్పు చేయలేదని, అది నిరూపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కాంగ్రెస్ వాళ్లే ప్రభుత్వంలో ఉన్నారని, రెండు నిమిషాల్లో డాక్యుమెంట్స్ తెప్పించే వారికే అధికారం ఉన్నదని, అలాంటప్పుడు ఈ రచ్చ, గొడవ ఎందుకని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.
దమ్ముంటే నిరూపించాలి
ఆరోపణలు చేయడం గొప్ప కాదని, దమ్ముంటే వాటిని నిరూపించాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి సవాల్ చేశారు. ఆరోపణలు నిరూపించలేక పోతే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటిపల్లి విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకపోవడం, ప్రొటోకాల్ పాటించకపోవడం, మంత్రులు వచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనన్నారు.
నిజాలు తేల్చేందుకు సిద్ధం..
కాలేజీ భూముల విషయంలో అన్ని ఆధారాలతో నిజాలు నిగ్గు తేల్చేందుకు సిద్ధమని, అక్రమాలకు పాల్పడ్డ వారిని వదిలే ప్రసక్తే లేదని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేనీ సందీప్ అన్నారు. డీఎస్పీ ఆఫీసు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాలేజీ భూముల ఉదంతంపై ఎమ్మెల్యే రమణారెడ్డి విసిరిన సవాల్ తాము స్వీకరించి, ఆధారాలు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు వెళ్తుండగా, పోలీసులు వచ్చి అడ్డుకున్నారని చెప్పారు. శాంతిభద్రతల దృష్ట్యా డీఎస్పీ ఆఫీసుకు రావాలని చెబితే ఇక్కడకు వచ్చామన్నారు. కాలేజీ భూముల విషయంపై పోలీసుల పర్యవేక్షణలో చర్చకు సిద్ధమని తెలిపారు. భూకబ్జాల వెనుక ఉన్న వాస్తవాలు బయటపెడతామన్నారు.