హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ (Congress) పాలనలో చేపపిల్లల ఉచిత పంపిణీ (Fish Distribution) కార్యక్రమం అటకెక్కినట్టే కనిపిస్తున్నదని మత్స్యకార సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అక్టోబర్ ముగిసినప్పటికీ కనీసం 10 శాతం చేప పిల్లలు కూడా సరఫరా కాలేదని వాపోతున్నారు. ఎన్నికల ముందు మత్స్యకారులను ఆదుకుంటామని, నాణ్యమైన చేపపిల్లలను సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో విఫలమైందని విమర్శిస్తున్నారు. నిరుడు 80 కోట్ల ఉచిత చేపపిల్లలను పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది.
కనీసం 40 కోట్ల పిల్లలు కూడా పంపిణీ చేయలేదు. నాణ్యత లేకపోవడంతో అవి కూడా పెరగక, తీవ్రంగా నష్టపోయామని మత్స్యకారులు చెప్తున్నారు. ఈ ఏడాది కూడా చేప పిల్లల పంపిణీ ఆలస్యమైంది. రూ.123 కోట్లతో దాదాపు 26 వేల చెరువుల్లో 80 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ కోటి చేపపిల్లలను కూడ సరఫరా చేయలేదని మత్స్యకారులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఏజెన్సీల అలసత్వంతో పంపిణీలో ఆలస్యమైందని, ఇది చేపల పెరుగుదలపై ప్రభావం చూపనున్నదని మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.
మత్స్యకారులకు చేయూత అందించడానికి 2016 నుంచి కేసీఆర్ చేప పిల్లలు ఉచిత పంపిణీ చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పాలనలో చేపపిల్లల పంపిణీ పథకంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేప పిల్లల పంపిణీ పథకంలో 80-100 మి.మీ పిల్లలకు రూ.1.50, 35-40 మి.మీ పిల్లలకు రూ.0.50 చొప్పున కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది. అయినప్పటికీ కాంట్రాక్టర్లు నాణ్యమైన పిల్లలను సరఫరా చేయడం లేదు. సొసైటీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తే మత్స్యకారులకు నచ్చిన చేప పిల్లలు కొనుక్కుంటారు. ఈ విషయం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.
-కోల కరుణాకర్, తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి