జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిస్తే తన సీఎం పదవి పోతుందని రేవంత్‌రెడ్డి భయపడుతున్నడు. అందుకే ఆయన ఆందోళన చెందుతున్నడు. బీఆర్ఎస్ గెలిస్తే పథకాలు రద్దవుతయని పదే పదే బెదిరిస్తున్నడు. కానీ ఈ దరిద్రాన్ని ఎప్పుడు వదిలించుకుందామా? అని ప్రజలు ఎదురుచూస్తున్నరు.
-కేటీఆర్
హిందూ-ముస్లిం కోణంలో తెలంగాణ ప్రజలు ఆలోచించరు. ఈ రాష్ట్రం విశాల భావాలు కలిగి ఉన్నది. ఇకడ కమ్యూనిస్టుల సాయుధ పోరాటం జరిగిన చరిత్ర ఉన్నది. ఇక్కడ కుల, మత భావనలు లేవు. లేనివాటిని కొందరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నరు.
-కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపబోరని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మ విజయకేతనం ఎగురవేయడం తథ్యమని తేల్చిచెప్పారు. ‘రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేసిందని ఆ పార్టీకి ఓటేస్తారు.. తులం బంగారం ఇవ్వనందుకా? మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలు చేయనందుకా? యువతులకు స్కూటీలు ఇవ్వనందుకా? మహిళలకు రూ.2500 ఇవ్వనందుకా? నగరాభివృద్ధికి రూ. 6వేల కోట్లు ఇవ్వనందుకా? ముస్లింలకు రూ.4వేల కోట్లు కేటాయించనందుకా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్‌రెడ్డి రెండేండ్లలో చేసిన అరాచకాలను చూసిన ప్రజలు ఆ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారనుకోవడం అత్యాశేనని పేర్కొన్నారు.
ఆదివారం సాయంత్రం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ నవంబర్ 14న వెలువడే ఫలితంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని జోస్యం చెప్పారు. మైనార్టీలు బీఆర్ఎస్కు దగ్గరయ్యారని భావించి రేవంత్‌రెడ్డి అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారని చెప్పారు. అజార్‌కు ఈ పదవి రావడానికి బీఆర్ఎస్సే కారణమని, అజారుద్దీన్ కేసీఆర్ ఫొటో పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని, ముస్లిం ఓట్ల కోసం అజారుద్దీన్ పదవిని బీజేపీ అడ్డుకుంటున్నదనే వాదనలు రేవంత్‌రెడ్డి లాంటి అల్పులకు వచ్చే చిల్లర ఆలోచనలని విమర్శించారు. తాము ఆ పదవిని స్వాగతిస్తున్నామని చెప్పారు. మాగంటి గోపీనాథ్ 16000 పైచిలుకు ఓట్లతో గెలిచారని, ఇప్పుడు ఊహించనివిధంగా భారీ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ పనితీరే కీలకం కానున్నదని, హిందూ, ముస్లిం తేడా లేకుండా బీఆర్ఎస్కు మద్దతు లభిస్తుందని పునరుద్ఘాటించారు.
ఏ సీఎం కూడా పథకాలు రద్దుచేస్తామనలే
ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి మాటల్లో ఫ్రస్ట్రేషన్, బాధ, భయం కనబడుతున్నాయని కేటీఆర్ ఎద్దేవాచేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోతే పథకాలు రద్దు చేస్తామని బెదిరించిన దాఖలాలు లేవని గుర్తుచేశారు. అయినా ఏ పథకాలూ ప్రారంభించకుండా రద్దుచేస్తామనడం హాస్యాస్పదంగా ఉన్నదని దెప్పిపొడిచారు. ‘ఈ రాష్ట్రం రేవంత్ అబ్బసొత్తు కాదు.. రారాజు కాదు, చక్రవర్తి కాదు, నియంత కాదు’ అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు పదే పదే ఒక అవకాశమివ్వాలని అడగడం హాస్యాస్పదమని, ఒక అవకాశం ఇచ్చినందుకే హైదరాబాద్ బర్బాద్ అయిందని దుయ్యబట్టారు.
జీవోలు చూపితే రాజీనామా చేస్తా
కంటోన్మెంట్ ఉపఎన్నిక టైంలో రూ.4000 కోట్లతో అభివృద్ధి చేస్తానని సీఎం ఇచ్చిన హామీ పచ్చి అబద్ధమని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించిన జీవోలు చూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొంటానని, లేదంటే పచ్చి అబద్ధాలు చెప్పినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీతో కాంగ్రెస్‌వి చీకటి ఒప్పందాలు
బీజేపీతో బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతుందన్న ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. సీఎం రమేశ్ కారులో అర్ధరాత్రి అమిత్ షాను ఎవరు కలుస్తున్నారో అందరికీ తెలుసని చెప్పారు. బీజేపీతో అక్రమ సంబంధాలు ఎవరు పెట్టుకున్నారో చైతన్యవంతమైన ప్రజలకు తెలుసని, సరైన తీర్పు వారే ఇస్తారని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ వారి స్థానాల్లో ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని, జూబ్లీహిల్స్ తరహాలోనే ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి వాటాలు పంచుకొని దోపిడీ చేస్తున్నాయని, కాంగ్రెస్‌కు బీజేపీ రక్షణ కవచంలా ఉంటున్నదని విమర్శించారు. ఈ ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని చెప్పారు.
రేవంత్ ఫ్యామిలీకే పెట్టుబడులు
రేవంత్ గద్దెనెక్కిన తర్వాత లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయనడం పచ్చి అబద్ధమని కేటీఆర్ కొట్టిపారేశారు. ఈ పెట్టుబడులు సీఎం సోదరులకు, కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ పెద్దలకే తప్ప హైదరాబాద్ నగరానికి ఎకడ వచ్చాయో చూడాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి చెప్పింది నిజమే అయితే, తెలంగాణ ఆర్థిక వృద్ధి సూచీల్లో ఎందుకు చివరి స్థానానికి పడిపోయిందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రానికి ఇప్పుడు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు.
గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉంటం
మాగంటి గోపీనాథ్ మరణానంతరం ఆయన సతీమణి సునీతను సెంటిమెంట్ ఆధారంగా నిలబెట్టారనే విమర్శలను కేటీఆర్ ఖండించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుతం పీజేఆర్‌పై ప్రేమ ఒలకబోస్తున్నారని, కానీ ఆయన వారసుడు విష్ణువర్ధన్‌రెడ్డికి 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ టికెట్ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డిలా కమర్షియల్‌గా కాకుండా బీఆర్ఎస్ను ఒక కుటుంబంగా భావించి నడుపుతామని స్పష్టంచేశారు. దుబ్బాక, కంటోన్మెంట్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కుటుంబ సభ్యులను నిలబెట్టినట్టుగానే, ఇకడా మాగంటి గోపీనాథ్ సతీమణిని నిలబెట్టామని వివరించారు.
గద్దరన్న కుమార్తెకు కూడా సీటు ఇవ్వని రేవంత్‌రెడ్డి, ఎవడి గొంతు పడితే వాడి గొంతు కోసే రకం కాదా? అని విమర్శించారు. ఎన్టీఆర్‌కు మాగంటి గోపీనాథ్ కంటే పెద్ద ఫ్యాన్ ఇంకెవరూ ఉండరని స్పష్టంచేశారు. తెలంగాణలో ఎన్టీఆర్ నిలువెత్తు పోస్టర్‌ను సచివాలయం ఎదుట పెట్టి పోస్టర్ల సంస్కృతి తెచ్చిందే గోపీనాథ్ అని గుర్తుచేశారు. గోపీనాథ్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని చనిపోయిన వ్యక్తిపై అభాండాలు వేయడం సరికాదని మండిపడ్డారు. ఎన్టీఆర్ పోయిన 10 ఏండ్ల్లకు రాజకీయాల్లోకి వచ్చిన రేవంత్‌రెడ్డికి ఎన్టీఆర్ గురించి ఏమీ తెలియదని కొట్టిపారేశారు.
చంద్రబాబు అంటే గౌరవం
చంద్రబాబు అరెస్టు సమయంలో జరిగిన సోషల్ మీడియా ప్రచారాలపై కేటీఆర్ వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌ను పరస్పర రాజకీయ తగాదాలకు వేదిక చేయవద్దని తాను ఆ రోజు చెప్పిన మాటకు నేటికీ కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు, లోకేశ్‌కు కూడా చెప్పామని, తమకు వారి పట్ల గౌరవం ఉన్నదని, మంచి ఉద్దేశంతోనే ఆ ప్రకటన చేశామని స్పష్టంచేశారు. ఇతరుల బాధ చూసి సంతోషపడే చిల్లర కుసంసారిని కానని స్పష్టంచేశారు. రేపు రేవంత్‌రెడ్డికి వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా పరామర్శిస్తానని తెలిపారు.
బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రభుత్వం తోవకొస్తది
బీఆర్ఎస్ పార్టీ, పదేండ్ల ప్రభుత్వ పనితీరు, హైదరాబాద్ అభివృద్ధి, ప్రస్తుతం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాడుతున్న పద్ధతిని గమనించి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేయాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం భయంతోనైనా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని తేల్చిచెప్పారు. ఈ ప్రభుత్వం సరైన తోవలోకి రావాలంటే బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని కోరారు. కంటోన్మెంట్ సీటును కోల్పోవడంపై స్పందిస్తూ ఆ సమయంలో దేశమంతా మోదీకి అనుకూలంగా, వ్యతిరేకంగా నిట్టనిలువుగా చీలిపోయిందని, ఆ జాతీయస్థాయి హవాలో కంటోన్మెంట్‌ను కూడా కోల్పోయామని చెప్పారు.
రేవంత్‌రెడ్డి సీటుకే గ్యారెంటీ లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్ల్లు ఉంటుందా అనే ప్రశ్నకు కేటీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌లో అంతర్గత కీచులాటలు చూస్తే ఆ నమ్మకం లేదని తెలిపారు. రాహుల్‌గాంధీకి కోపం వస్తే రేవంత్‌రెడ్డి పదవి రద్దయ్యే అవకాశం ఉన్నదని, ఆయనను పర్మినెంట్ ఆర్టిస్ట్ లాగా భావించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆయన సీటుకే గ్యారెంటీ లేనప్పుడు, మూడేండ్లు అభివృద్ధి చేస్తారనే హామీకి నమ్మకం ఎక్కడిదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఎప్పుడు బీజేపీ వైపు జంప్ కొడతారో తెలియదని ఎద్దేవాచేశారు.
బీఆర్ఎస్ను ఒక కుటుంబంగా భావించి నడుపుతున్నం. దుబ్బాక, కంటోన్మెంట్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కుటుంబ సభ్యులను నిలబెట్టినట్టుగానే, జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్ సతీమణిని నిలబెట్టినం. గద్దరన్న కుమార్తెకు కూడా సీటు ఇవ్వని రేవంత్‌రెడ్డి, ఎవడి గొంతు పడితే వాడి గొంతు కోసే రకం కాదా?
-కేటీఆర్