హైదరాబాద్/బంజారాహిల్స్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రిజర్వేషన్ల పేరిట బీసీలను బుకాయిస్తే ఉపేక్షించేది లేదని బీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రైవేట్ బిల్లులను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీయే ప్రవేశపెట్టి నిబద్ధతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అందుకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని కోరారు. బీసీ జేఏసీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం బీసీ జేఏసీ వరింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ కళింగభవన్‌లో ఆదివారం కొనసాగింది. సమావేశంలో పాల్గొన్న జేఏసీ నేతలు, వక్తలు మాట్లాడుతూ.. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టడంతోపాటు మద్దతు కూడగట్టే బాధ్యత కూడా ఇండియా కూటమి మీద, రాహుల్‌గాంధీ మీద ఉన్నదని చెప్పారు. ధర్నాలు, దీక్షలతో రిజర్వేషన్లు రావని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వం వహించి బీసీ జేఏసీ, అఖిలపక్షాన్ని రాహుల్‌గాంధీతో సమావేశపరచాలని, నిబద్ధత నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల హకులను అవహేళన చేసే బీజేపీ ఎంపీలను తెలంగాణలో తిరగనీయబోమని, వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలయ్యే వరకూ బీసీ మంత్రులు జేఏసీ పక్షాన నిలవాలని, అవసరమైతే మంత్రి పదవులకు రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. పార్టీపరమైన రిజర్వేషన్లంటూ బుకాయిస్తే ప్రభుత్వాన్ని ఎకడికి అకడ స్తంభింపజేస్తామని హెచ్చరించారు.
ప్రజా పోరాటాలు నిర్వహిస్తూనే, ఢిల్లీ కేంద్రంగా పార్లమెంటులో పార్టీల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. న్యాయవాదులు, జర్నలిస్టులు, ఉద్యోగులు, కులవృత్తులు, విద్యార్థుల భాగస్వామ్యంతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి కమిటీల నిర్మాణం చేపట్టి, బీసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో కో చైర్మన్ దాసు సురేశ్, కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, జూలూరి గౌరీశంకర్, బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవా ద, డాక్టర్స్, మేధావుల సంఘాల నేతలతోపాటు అన్ని యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
దశాబ్దాలుగా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉన్నదని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్ష నేత స్పీకర్ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీలను పకనపెట్టి బీసీలకు సామాజిక న్యాయం దక్కడానికి తెలంగాణలో మరో పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల సాధనలో బీసీలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదనే రీతిలో ఒకే జట్టుగా పోరాడాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీగా, బీసీ బిడ్డలుగా బీసీ జేఏసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని సూచించారు.
రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చితేనే బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లకు రక్షణ లభిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆ బాధ్యత బీజేపీ, కాంగ్రెస్‌దేనని ఆ దిశగా ఒత్తిడి పెంచేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఓ సారి బిల్లులని, మరోసారి జీవో, ఆర్డినెన్స్ అంటూ పూటకో మాట చెప్తూ బీసీలను మోసం చేసిందని మండిపడ్డారు. బీజేపీ సైతం 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలను వంచిస్తున్నదని విమర్శించారు.
తరతరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. అంబేదర్, ఫూలే చూపించిన మార్గంలో బీసీలు ఐక్యమై గల్లీ నుంచి ఢిల్లీ వరకు దండుకట్టాలని, పోరాడితే పోయేదేమీలేదని పేర్కొన్నారు. బీసీలు తమ హకుల కోసం ఐక్యంగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్ల సాధనకు జేఏసీ భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. అష్టాంగ ఆందోళనలు పేరిట ఉద్యమించాలని తీర్మానించింది. ఈ నెల 6వ తేదీన పూలే, అంబేదర్ విగ్రహాల ఎదుట మౌనదీక్షలు, 13న బీసీల ధర్మపోరాట దీక్షలు, 16న రన్ ఫర్ సోషల్ జస్టిస్, 18న ఎంపీలతో బీసీల ములాఖత్, 23న అఖిలపక్ష పార్టీల సమావేశం, డిసెంబర్ మొదటి వారంలో చలో ఢిల్లీ, పార్లమెంటు ముట్టడి, డిసెంబర్ మూడోవారం నుంచి బీసీల బస్సుయాత్ర, జనవరి 4వ వారంలో ‘వేలవృత్తులు- కోట్ల గొంతులు’ అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.