హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడ్డయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్నాయనే అభియోగంతో పేదల ఇండ్లను వెంటనే కూలుస్తున్న రేవంత్ సర్కారు.. చెరువుల్లో కట్టిన పెద్దల విల్లాల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? స్కూళ్లు, అనాథ శరణాలయాలు, పేదల ఇండ్లను కూల్చుతున్న బుల్డోజర్లు.. మంత్రులు, కాంగ్రెస్ నేతలు, సీఎం సోదరుడి ఇండ్ల దగ్గరకు ఎందుకు వెళ్లడం లేదు?
– కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కట్టడాలు, భారీ నిర్మాణాలు కనిపిస్తే.. రెండేండ్ల రేవంత్ పాలనలో కూల్చడాలు మాత్రమే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఇండ్లను వెంటనే కూలుస్తున్న రేవంత్ సర్కారు.. చెరువుల్లో కట్టిన పెద్దల విల్లాల జోలికి ఎందుకు పోవడం లేదని నిలదీశారు. బుల్డోజర్ తన మీది నుంచి వెళ్లాలని యూపీలో అడ్డం పడిన రాహుల్‌గాంధీ.. తెలంగాణలో అదే బుల్డోజర్ పేదల ఇండ్లను కూలగొడుతుంటే ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి తరఫున పార్టీ లీగల్ సెల్ న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ‘పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేదవాళ్లకు ఒక న్యాయం’ అనే నినాదంతో హైడ్రా అరాచకాలపై హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో చేసిన అమానవీయ, అరాచక చర్యలను, చిన్నారుల, పేదల ఆర్తనాదాలను పీపీటీలో కండ్లకు కట్టినట్టు చూపించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హైడ్రా బాధితులు కేటీఆర్ వద్ద తమ గోడు వెళ్లబోసుకోగా వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మూసీ, హైడ్రా వల్ల హైదరాబాద్ నగరంలో ఎంతో మంది బాధితులుగా మారని, చాంద్రాయణగుట్టలో పాఠశాలను కూడా కూలగొట్టారని మండిపడ్డారు.

మంత్రి పొంగులేటి చెరువును పూడ్చి ఇల్లు కట్టిండు. ఆయన ఇంటికి వెళ్లే ధైర్యం హైడ్రా కమిషనర్ చేస్తరా? మంత్రి వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెరువుల్లోనే ఇండ్లు కట్టిండ్రు. వీళ్లను ముట్టే ధైర్యం హైడ్రా చేస్తదా? రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లోపలే ఇల్లు కట్టిండు. సున్నం చెరువులో ఇల్లు కట్టుకున్న పేదలది తప్పు.. దుర్గం చెరువులో కట్టిన తిరుపతిరెడ్డిది ఒప్పా?
-కేటీఆర్
రేవంత్ ఒక్క ఇటుకైనా పేర్చిండా?
సీఎం రేవంత్‌రెడ్డికి కట్టడం చేతకాదని, కేవలం కూల్చడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎకడ చూసినా కట్టడాలే కనిపిస్తయి. హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించినం. వైట్‌హౌస్‌ను తలదన్నేలా సచివాలయం నిర్మించినం. దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నం. హైదరాబాద్‌లో 42 ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినం. ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కట్టుకున్నం. నీటి ప్రాజెక్టులు కట్టుకున్నం. ఒకటి, రెండు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎకడికకడ కొత్త నిర్మాణాలు చేసుకున్నం. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఒక ఇటుక పేర్వలే.. ఒక కొత్త కట్టడం చేపట్టలే. ఈ రెండేండ్లలో రేవంత్‌రెడ్డి చేసిందేంటంటే కూలగొట్టడమే. ఈ ప్రభుత్వం వల్ల జరిగిన అన్యాయానికి ఎంతో మంది బాధితులుగా మారిండ్రు. 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తది. హైడ్రా బాధితులందరికీ న్యాయం చేస్తాం’ అని భరోసా ఇచ్చారు.
పెద్ద బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లరు?
పేదల ఇండ్లను రాత్రికి రాత్రే పోలీసు బందోబస్తుతో కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు, పెద్ద బిల్డర్లు మూసీకి అడ్డంగా భారీ నిర్మాణాలు చేపట్టినా ఎందుకు వెల్లడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ‘గృహ ప్రవేశం చేసి వారం రోజులు కాలేదు.. ఒక ఇంటిని బుల్డోజర్ కూలగొట్టింది. గర్భిణిని అని కూడా చూడకుండా పకకు తోసేసి ఇండ్లు కూల్చివేశారు. మూడేండ్ల చిన్నారి భోజనం కోసం ఏడ్చిన పరిస్థితిని హైడ్రా సృష్టించింది. ఎవ్వరూ ఇంత అన్యాయంగా, కిరాతకంగా పనిచేయాలని కోరుకోరు. బాధితుల పరిస్థితి ఎలా ఉంటుందో అంతా ఆలోచించాలి.
హైడ్రా బాధితుల బాధ అందరికీ అర్థం కావాలి. హైడ్రాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు. చాలా విషయాలు చెప్పారు. చాలా మంది బిల్డర్ల పేర్లు చెప్పారు కానీ.. మేం ఏ బిల్డర్‌నూ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మేము ఒక్కటే అడుగుతున్నం.. పేదవాడి ఇంటికి బుల్డోజర్ వచ్చింది.. ఆ బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదో ప్రభుత్వం చెప్పాలి. పేద వాడికి ఒక న్యాయం.. ఉన్న వాడికి ఒక న్యాయం.. ఇది ఈ ప్రభుత్వ పనితీరు. పేదలు కోరుకునేది ఒకటే.. కూడు, గూడు, గుడ్డ. అయితే, కాంగ్రెస్ సర్కారు గూడు లేకుండా పేదల ఇండ్లు కూల్చి వేస్తున్నది. ప్రభుత్వానికి అంతా సమానమైతే పెద్దల జోలికి ఎందుకు వెళ్లలేదు. వారికి ఎందుకు నోటీసులివ్వలేదు. పేదలకు న్యాయం చేయాలనుకుంటే.. ఫైవ్‌స్టార్ హోటళ్లలో సమావేశాలు ఎందుకు పెడుతున్నట్టు? రూల్స్ అతిక్రమిస్తే కాపాడాలని మనమేం చెప్పట్లేదు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.

పొంగులేటి, తిరుపతిరెడ్డి, గుత్తా చేస్తే రైటా?
మంత్రులు, కాంగ్రెస్ నేతలు చెరువుల్లో ఇండ్లు కట్టుకుంటే రైటు, పేదలు చిన్న ఇండ్లు కట్టుకుంటే తప్పా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టిండ్రు. మరో మంత్రి వివేక్ కూడా హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నడు. వీళ్ల ఇండ్లకు వెళ్లే ధైర్యం హైడ్రా కమిషనర్‌కు ఉన్నదా? రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లోపల ఇల్లు కట్టుకున్నడు.
సున్నం చెరువులో ఇల్లు కట్టుకున్న పేదలది తప్పు.. దుర్గం చెరువులో కట్టిన తిరుపతిరెడ్డిది ఒప్పా? పేదలకు మాత్రం అసలు టైమ్ ఇవ్వరు.. తిరుపతిరెడ్డికి టైమ్ ఇచ్చి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలా చేస్తరు. ఇదేనా ప్రభుత్వ తీరు? ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి చెరువు మధ్యలోనే ఇల్లు కట్టుకున్నడు. ఆయనకు నోటీసులు ఇచ్చే దైర్యం హైడ్రాకు ఉన్నదా? శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెరువులోనే ఇల్లు కట్టుకున్నడు. వాళ్ల దగ్గరకు వెళ్లి వారికి నోటీసులు ఇచ్చే దమ్ము అధికారులకు ఉన్నదా?’ అని నిప్పులు చెరిగారు. వారు నిర్మించిన ఇండ్ల గూగుల్ మ్యాప్ వివరాలను మీడియాకు, హైడ్రా బాధితులకు వివరించారు.
అరికెపూడి 11 ఎకరాలకు ప్రభుత్వమే అండ
గాజులరామారంలో పేదలు నిర్మించుకున్న 50-60 గజాల్లోని ఇండ్లను కూల్చిన హైడ్రా.. పక్కనే ఉన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆక్రమణ జోలికి మాత్రం ఎందుకు వెళ్లడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. పేదవాళ్లను అక్కడి నుంచి తన్ని తరిమేసి, కేసులు పెట్టించి అక్కడ ఉన్న 11 ఎకరాల భూమిని కాంగ్రెస్‌లో చేరినందుకు అరికెపూడికి నజరానాగా ఇచ్చారని విమర్శించారు. బ్లూషీట్లు వేసి ప్రభుత్వమే అండగా ఉన్నదని మండిపడ్డారు.
పేదలను వెళ్ల గొట్టిన అధికారులు గాంధీకి మాత్రం అండగా నిలిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదలను తరిమివేసి గాంధీకి ఎందుకు భూమి అప్పగించారని కలెక్టర్‌ను ప్రశ్నిస్తే.. మాకు హద్దులు చూపించ లేదు. హద్దుల విషయంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. హద్దుల విషయం పేదలకు వర్తించదా? పేదలకు ఒక న్యాయం.. అరికెపూడికి మరో న్యాయమా? కాంగ్రెస్‌లో చేరితే ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయం ఉంటుందా? పేదల ఇంటి మీదకు బుల్డోజర్లు.. పెద్దల ఇండ్లకు పోలీస్ పహారాలు.. ఇదేమి న్యాయం? అని కడిగిపారేశారు. గాజులరామారంలో గాంధీకి అప్పగించిన 11 ఎకరాలకు సంబంధించిన భూమి వివరాల గూగుల్ మ్యాప్‌ను, ఫొటోలను ఈ సందర్భంగా మీడియాకు చూపించారు.
హైడ్రా బ్లాక్మెయిల్ టూల్
మూసీ నదిలో అడ్డంగా కట్టిన బడా బిల్డింగ్‌ను కూడా ఇప్పటి వరకు ఆపలేదని, ఆ ధైర్యం హైడ్రాకు ఎందుకు లేదని కేటీఆర్ ప్రశ్నించారు. మూసీని కబ్జా పెట్టి ఎట్లా కడుతరు? అని నోటీసులు ఇచ్చి అడ్డుకునే దమ్ము హైడ్రాకు ఉన్నదా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి బిల్డర్లను బ్లాక్మెయిల్ చేయడానికి హైడ్రాను టూల్‌గా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ‘పెద్ద బిల్డర్లు కడితే వారికి సహకరించి.. తానా తందానా ఆడతారు. మూసీకి అడ్డంగా ఆకాశమంత పెద్దగా టవర్లు కడితే కూడా వారికి కనిపించదు. మంత్రులు, పెద్ద పెద్ద నాయకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కానీ పేదల పైకి బుల్డోజర్లు పంపిస్తారు. అందుకే మేం హైడ్రాను వ్యతిరేకించేది. బ్లాక్ మెయిల్‌కు, బిల్డర్లను బెదిరించడానికి, వారి నుంచి డబ్బులు వసూలు చేయడానికి, బ్లాక్‌మెయిల్‌కు టూల్‌గా హైడ్రాను వాడుతున్నరు కాబట్టే, పేదలకు న్యాయం జరుగడం లేదు. అందుకే హైడ్రాను వ్యతిరేకిసున్నం’ అని స్పష్టంచేశారు.
హైడ్రా బాధితుల బాధ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు తెలియాలనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినం.. ఈ ప్రభుత్వం హైడ్రా బాధితులకు న్యాయం చేస్తదన్న నమ్మకం మాకు లేదు. మీకు హామీ ఇస్తున్న.. న్యాయం చేసే బాధ్యత మాది. 500 రోజులు ఆగితే కేసీఆర్ ప్రభుత్వం వస్తది. బాధితులకు అండగా ఉంటం. మన ప్రభుత్వం వచ్చాక బాధితులకు న్యాయం చేస్తాం.
-కేటీఆర్
హైడ్రా బాధితులకు న్యాయం చేస్తం
అవసరం ఉన్నప్పుడు ఓడ మల్లన్న.. అవసరం తీరాక బోడ మల్లన్న అన్నట్టుగా రేవంత్‌రెడ్డి సర్కారు తీరు ఉన్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు పేదలు గుడిసెలు వేసుకోమని చెప్పిన అదే రేవంత్‌రెడ్డి ఇప్పుడు వాటినే కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా బాధితుల బాధ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ‘ఈ ప్రభుత్వం హైడ్రా బాధితులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకు లేదు. ఎందుకంటే అన్యాయం చేసిందే వాళ్లు.. కూలగొట్టేందే వాళ్లు.. మీకు మళ్లీ హామీ ఇస్తున్న.. మీకు న్యాయం చేసే బాధ్యత మాది. 500 రోజులు ఆగితే కేసీఆర్ ప్రభుత్వం వస్తది.. బాధితులకు అండగా ఉంటం. మేము పదేండ్లలో ఏ ఒకరికీ అన్యాయం చేయలే. అదే బాధ్యతతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా బాధితులకు న్యాయం చేస్తం’ అని భరోసా ఇచ్చారు.
పిల్లల స్కూల్ కూల్చితిరుపతిరెడ్డి ఇల్లు కూల్చలే!

నాన్న ఆర్మీలో పనిచేశారు. ఆయన అమీన్పూర్లో జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నరు. నేను చిన్న పిల్లల కోసం ‘పియానో’ స్కూల్ నడుపుతున్న. స్కూల్ ఎఫ్టీఎల్లో ఉన్నదని హైడ్రా అధికారులు చెప్తే, హైకోర్టుకు పోయిన. నాకు ఇచ్చిన రోజునే సీఎం రేవంత్ అన్న తిరుపతి రెడ్డికీ హైకోర్టు స్టే ఇచ్చింది. నా ఆర్డర్ కాపీని అధికారులు పట్టించుకోలేదు. శనివారం రాత్రి పూట వచ్చి అర్ధరాత్రి దాకా కూల్చేసిండ్రు. తిరుపతిరెడ్డి ఇల్లు మాత్రం నేటికీ కూల్చలేదు. ఇన్నాళ్లు సంపాదించినదంతా పోయింది. ఈఎంఐలు కూడా కట్టే పరిస్థితి లేదు. మా ఇంటివెనుక కట్టిన కిడ్స్ హాస్పిటల్నూ కూలగొట్టిండ్రు.
– కుమార్తె మాన్సీతో మధుసూదన్
ఇక కోర్టులు ఎందుకు? ప్రజాస్వామ్యం ఎందుకు?
ఇండ్ల కూలగొట్టకుండా పేదలకు సమయం ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. పేదలు ఇండ్ల కోసం న్యాయస్థానాలకు వెళ్లకుండా కూలకొడితే.. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎందుకు? కోర్టులు ఎందుకు? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పేదల ఇండ్లు కూలగొట్టడం లేదని హైడ్రా కమిషనర్ అనడం శుద్ధ అబద్ధమని మండిపడ్డారు. ఫుల్ ట్యాంక్ లెవల్లో కడితే ఎవరినీ వదలమని చెప్తున్న హైడ్రా కమిషనర్‌కు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో మంత్రులు, కాంగ్రెస్ నేతలు కట్టుకున్న పెద్ద పెద్ద ఫామ్‌హౌస్‌లు, ఇండ్లు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వీళ్ల ఇండ్లు, ఫామ్ హౌస్‌లు ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు.
రాహుల్‌గాంధీ ఏం చేస్తున్నరు?
ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చుతున్నారని, ఇది అన్యాయమని ఢిల్లీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గొంతు చించుకొని మాట్లాడారని కేటీఆర్ గుర్తుచేశారు. బుల్డోజర్ తన శరీరంపై నుంచి వెళ్లాలని రాహుల్ అన్నారని, అదే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పేదల ఇండ్లను కూలగొడుతుంటే రాహుల్‌గాంధీ ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇది తప్పు అని.. రేవంత్‌రెడ్డికి రాహుల్ ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. ‘1980లో కొండాపూర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న కొందరికి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చింది. ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి వాటిని కూడా కూల్చివేశారు.
ఎవరో బడాబాబుకు ఆ భూమిని కట్టబెట్టారు. హైడ్రా చేసేది న్యాయమే అయితే.. అర్ధరాత్రి ఎందుకు వస్తున్నట్టు? నోటీసులు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏం ఇబ్బంది? పేపర్లు చూడటానికి ఏం ఇబ్బంది? ఇదే రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేదల ఇండ్లు కూలగొట్టడం తప్పు అని మాట్లాడారు. తప్పు జరిగితే రెగ్యులరైజ్ చేయండి అని చెప్పారు. కానీ, ఇప్పుడు ఆర్మీ కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. తెలియక తప్పు జరిగితే సరిదిద్దాలని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు కూల గొడుతున్నరు? నాడు వ్యతిరేకించిన అదే రేవంత్‌రెడ్డి ఇప్పుడు పేదల ఇండ్లను కూలగొట్టిస్తున్నరు’ అని ఫైరయ్యారు. నాడు ప్రతిపక్ష నేతగా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను మీడియాకు చూపించారు.

గృహ ప్రవేశం చేసి వారం రోజులు కాలేదు. ఒక ఇంటిని బుల్డోజర్ కూలగొట్టింది. గర్భిణి అని కూడా చూడకుండా పకకు తోసేసి ఇండ్లు కూల్చివేశారు. మూడేండ్ల చిన్నారి భోజనం కోసం ఏడ్చిన పరిస్థితిని హైడ్రా సృష్టించింది. ఎవ్వరూ ఇంత అన్యాయంగా, కిరాతకంగా పనిచేయాలని కోరుకోరు. బాధితుల పరిస్థితి ఎలా ఉంటుందో అందరూ ఆలోచించాలె.
-కేటీఆర్