గంభీరావుపేట, సెప్టెంబర్ 29: గంభీరావుపేట మండలంలోని పెద్ద గ్రామ పంచాయతీ కొత్తపల్లి. ఆ ఊరిలో మొత్తం 3993 ఓటర్లు ఉండగా, అందులో బీసీలు 2,469 మంది, ఓసీలు 781, ఎస్సీలు 687, ఎస్టీలు 56 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి నిర్వహించిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నడూ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అవకాశం దక్కలేదు.
దాదాపు 70 ఏండ్లుగా ఎప్పుడూ జనరల్, బీసీలకే రిజర్వ్ చేస్తున్నారని, ఇప్పుడూ అలాగే కల్పించారని, ఓటర్లలో 18 శాతం ఉన్న తమపై చిన్నచూపు ఎందుకని దళితులు ప్రశ్నిస్తున్నారు. తమ వర్గానికి చెందిన చాలా మంది సర్పంచ్, ఎంపీటీసీ పదవి కోసం ఎదురుచూసి వృద్ధులైపోయిన వారు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, రెండు ఎస్సీ, ఎస్టీ కుటుంబాలున్న గ్రామాల్లోనూ అవకాశం ఇస్తున్న ఈ రోజుల్లో మేమేం పాపం చేశామని ప్రశ్నిస్తున్నారు.