దుబ్బాక, సెప్టెంబర్ 29: దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా మహిళలు అట్టహాసంగా నిర్వహించుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ముస్తాబు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను పెట్టి, ఆటపాటలతో సందడి చేశారు. దుబ్బాక మున్సిపల్ నుంచి రూ.10 లక్షలు వెచ్చించి అన్ని వార్డుల్లో బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేపట్టారు.
దుబ్బాక పోచమ్మ ఆలయం వద్ద బతుకమ్మ సంబురాలు జరుపుకొనేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో డీజే సౌండ్‌తో పాటు విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఆడిన అనంతరం మహిళలు స్థానిక పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. వారి వెంట తెచ్చుకున్న సద్దులను బంధుమిత్రులతో కలిసి ఆరగించారు. దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో ఆనందోత్సవాల మధ్య జరుపుకొన్నారు.
దుబ్బాకలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దుబ్బాకలో పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, ఎల్లారెడ్డి, కిషన్‌రెడ్డి, ఎల్లం, ఆస స్వామి, యాదగిరి, దేవుని లలిత, రామస్వామిగౌడ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.