జహీరాబాద్, సెప్టెంబర్ 29: కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మంజీరా నదికి భారీగా వరద వస్తున్నది. ఫలితంగా సింగూరు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో పంటపొలాలు నీట మునిగాయి. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్‌నగర్, చీకూర్తి, అమీరాబాద్, కాకిజనవాడ, ముర్తుజాపూర్, చాల్కి, రాఘవపూర్ గ్రామ శివారులో పంటపొలాలు సింగూర్ బ్యాక్‌వాటర్‌తో నీట మునిగాయి.
ఈసారి సింగూరు బ్యాక్‌వాటర్ ఎఫ్టీఎల్ జోన్‌కు మించి రావడంతో వందలాది ఎకరాల్లో పంటలు మునగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. న్యాల్కల్ మండలంలోని చాల్కి-చీకూర్తి గ్రామాల మధ్య కల్వర్టుపై నుంచి సింగూరు బ్యాక్‌వాటర్ ఉధృతంగా ప్రహిస్తుండడంతో తెలంగాణ-కర్ణాటక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హద్నూర్ పోలీసులు కల్వర్టు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచించారు.