జగిత్యాల, సెప్టెంబర్ 29 : అమలుకు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గోస పడుతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ముందుగా మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టారు.
ఆడబిడ్డల పెద్దపండుగ బతుకమ్మకు కేసీఆర్ హయాంలో చీరలు అందించారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ 800 ఇందిరమ్మ చీరలు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు మహిళలకు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని మండిపడ్డారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు 4వేల పెన్షన్ ఇస్తామని మరిచిపోయారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతులను గోస పెట్టుడు, ఢిల్లీకి సంచులు మోసు డు, కేసీఆర్ను తిట్టుడు తప్పా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
పిచ్చి మాటలు బంద్ చేయాలని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. కాంగ్రె స్ ఇచ్చిన హామీలపై జిల్లాలోని ప్రతి ఇంటికీ బాకీ కార్డు (పోస్ట్కార్డును) పంపిస్తామని చెప్పారు. అనంతరం జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, తన వార్తలు మీడియాలో రాకుండా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యాజమాన్యాలతో ఒత్తిడి తెచ్చి అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు ఇస్తామన్నా చీరలు ఇవ్వలేదని, మహిళలకు ఇచ్చిన అన్ని హామీలూ మోసమేనని ఆగ్రహించారు.
అన్ని వర్గాలను మోసం చేసిన ఆ పార్టీకి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, జగిత్యాల రూరల్, అర్బన్, సారంగాపూర్, బీర్పూర్, రాయికల్ మండల అధ్యక్షులు ఆయిల్నేని ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, తేలు రాజు, నేరెళ్ల సుమన్, బర్కం మల్లేశం, మాజీ జడ్పీటీసీ కొలుముల రమణ, సాగి సత్యంరావు, హరీశ్ కల్లూరి, ప్రతాప్, పునుగోటి కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
35 మంది బీఆర్ఎస్లో చేరిక
కాంగ్రెస్ మోసపూరిత హామీలకు విసుగు చెంది కోరుట్ల మండలం నాగులపేటకు చెందిన 35 మంది ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వీరికి విద్యాసాగర్ రావు కండువా కప్పి, ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సింగిరెడ్డి శేఖర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, రాజగంగారెడ్డి, కుర్మా మల్లేశ్, గడ్డం రామిరెడ్డి, స్వామిరెడ్డి, జగన్, బైరి నాగరాజు, పాల దివాకర్ తదితరులు పార్టీలో చేరారు.