తిమ్మాపూర్, సెప్టెంబర్29: తిమ్మాపూర్ మండలం వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆడబిడ్డలు తీరొక్క పూలతో చక్కగా పేర్చిన బతుకమ్మలను గ్రామ శివార్లలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఘాట్ వద్దకు తీసుకెళ్లి అక్కడ ఆడి పాడారు. యువతులు కోలాటం, డిఫరెంట్ స్టెప్స్ తో అలరించారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు.
అనంతరం బతుకమ్మను సమీపంలోని చెరువుల్లో, గుంటల్లో నిమజ్జనం చేసి.. వాయినాలను ఇచ్చిపుచ్చుకొని ఆనందంగా ఇండ్లకు వెళ్లారు. ఈ వేడుక సందర్భంగా గ్రామంలోని ఆడబిడ్డలు తమ స్నేహితుల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఏడాది తర్వాత కలిసిన స్నేహితులు ఆనందంగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ వేడుకల్లో తిమ్మాపూర్ మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి, పలు గ్రామాల్లో మహిళా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.