బడంగ్‌పేట : బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ( Ration Cards ) ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి (MLA Sabita Indra Reddy) పేర్కొన్నారు. బాలాపూర్( Balapur ) మండలానికి సంబంధించిన రేషన్ కార్డుల ధరఖాస్తులు 8,577 రాగా 2,192 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి.
సోమవారం బడంగ్‌పేటలో ఉన్న ప్రజా భవనంలో రేషన్ కార్డులను లబ్ధిదారులకు టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహరెడ్డితో కలిసి సబితా ఇంద్రారెడ్డి లబ్ధి దారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం 6.48లక్షల రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా అందజేసిందని గుర్తు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో 90వేల రేషన్ కార్డులు అందజేసినట్లు వివరించారు. వాస్తవాలను తెలుసుకోకుండా గత ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు.
పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద వాడికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందాలన్నారు. రేషన్ కార్డులు ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. కుటుంబాలు పెరుగుతున్నప్పుడు తప్పని సరిగా కొత్త రేషన్ కార్డులు జారిచేయవలసిందేనని వెల్లడించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పని సరిగా సంక్షేమ పథకాలు అందరికి అందే విధంగా చొరవ తీసుకోవలసిన బాధ్యత ఉందన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు కేసీఆర్ అమలు చేసిన విషయం గుర్తు చేశారు. కేసీఆర్ పెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజ్ రియింబర్స్‌మెంట్ ఇవ్వక పోవడంతో పేద విద్యార్థులు విద్యకు దూరం అయే పరిస్థితి కన్పిస్తుందన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ రావడం లేదని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ మండల డిప్యూటీ తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, సహాకారం సంఘం చైర్మన్ మర్రి నర్సింహరెడ్డి, ఐఆర్‌లు జమీల్, ప్రశాంతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయపల్లి శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.