Weather : మండే ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్నట్టు వెల్లడించింది. ఈ వాతావరణ మార్పుల వల్ల గురువారం నుంచి శనివారం వరకు రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
ముఖ్యంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ కొన్నిచోట్ల వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజులు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
అయితే గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండకపోవచ్చని, ఎండ తీవ్రత కొనసాగుతూనే మధ్యమధ్యలో వానలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.