Weather : మండుటెండలు, తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని, ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఈ వారం చివరి నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్–నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని వెల్లడించింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోందని, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని చెప్పింది. దీనికితోడు తూర్పు గాలులలోని ద్రోణి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన ప్రకారం.. సోమవారం ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల చక్రవాత ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుంది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరుగనున్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తరకోస్తాంధ్రప్రదేశ్లో మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు వీయనున్నాయి. రాయలసీమలో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.