బూర్గంపహాడ్, మే 12 : ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో జీపీఏఐ పథకం ద్వారా మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల బీమా చెక్కును బూర్గంపహాడ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్ నాగరాజు మంగళవారం అందజేశారు. బ్యాంకులో జరిగిన కార్యక్రమంలో మండల పరిధిలోని సోంపల్లి గ్రామానికి చెందిన సోడె నరేష్ బ్యాంకులో ఖాతాతో పాటు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జీపీఏఐ పథకంలో బీమా తీసుకున్నాడు. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో నామినీగా ఉన్న సోడె గోపయ్యకు బీమా నగదు రూ.20 లక్షల చెక్కును బ్యాంకు అధికారులు అందజేశారు.
ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ జీవితంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో ఎవరికీ తెలియదని, అలాంటి సమయంలో కుటుంబానికి అండగా నిలిచేది బీమా పథకాలేనని అన్నారు. చిన్నమొత్తంలో ప్రీమియం చెల్లించుకుంటే పెద్ద మొత్తంలో కుటుంబానికి భరోసా లభిస్తుందన్నారు. ప్రతిఒక్క ఖాతాదారుడు బీమా చేయించుకుంటే వారి కుటుంబానికి ఆర్ధిక భరోసా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందా నాగరాజు, బ్యాంక్ శాఖ మేనేజర్ ప్రసాద్, ఖాతాదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.