బూర్గంపహాడ్, మే 12 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి పల్లె దవాఖానలో ప్రజల ఆరోగ్యం, పారిశుధ్యం, ఇతర వ్యాధులకు సంబంధించి సర్పంచ్ గుండె బాబూరావు అధ్యక్షతన మంగళవారం ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను వినియోగించాలని, ఎండదెబ్బ తగలకుండా నీడపట్టున ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. వీటితో పాటు అసాంఘీక వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎలెచ్పీ జ్యోతి, ఏఎన్ఎం సుందరవేణి, ఆశావర్కర్లు, 1వ వార్డు సభ్యురాలు కేలోత్ దుర్గ, గ్రామస్తులు పాల్గొన్నారు.