కాచిగూడ,మే 12: సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యస్థ అస్తవ్యస్తంగా తయారైందని, సీఎం అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు చదువు దూరమవుతున్నారని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. ప్రభుత్వం జీఓ నెంబర్-7ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలో మంగళవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జీఓ కాపీలను మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ చించివేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జీఓ నెంబర్-7ను విరమించుకోకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర మానుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఆధారపడి చదువుతున్నారని, రూ.10 వేల కోట్ల పైగా బకాయిలు ఉండడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఆరోపించారు. తెలంగాణలో 17 మంది విద్యార్థులు చనిపోయిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, ఉదయ్,నందగోపాల్,రవీందర్, మాణిక్, తికల్సింగ్, వేణు, తదితరులు పాల్గొన్నారు.