కీవ్, ఏప్రిల్ 15: ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయడం మానుకోవాలని అమెరికా, దాని మిత్ర దేశాలను రష్యా హెచ్చరించింది. ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతకు అమెరికా చర్యలు తీవ్ర విఘాతం కలిగిస్తాయని, ఊహించడానికి కూడా వీలులేని పర్యవసానాలను ప్రపంచం ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నది. ‘అమెరికా తన బాధ్యతారాహిత్యాన్ని ఇకనైనా వీడాలి’ అని వ్యాఖ్యానించింది. స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలో చేరాలని ఆలోచిస్తున్న విషయంపై కూడా రష్యా ఘాటుగా స్పందించింది. ‘స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలో చేరితే బాల్టిక్ సముద్ర తీరంలో మా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది’ అని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదెవ్ అన్నారు. అవసరమైతే అణ్వాయుధాలను కూడా మోహరించాల్సి రావొచ్చని పేర్కొన్నారు. ఈ రెండు దేశాలను తమ కూటమిలో చేర్చుకొనే అంశంపై నాటోను పరోక్షంగా హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరాలని యోచిస్తున్నాయి. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని ఫిన్లాండ్ ఇటీవలే ప్రకటించింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలై శుక్రవారంతో 50 రోజులు నిండాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దేశ ప్రజలనుద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘ఆక్రమణ ప్రారంభంలో రష్యా మాకు కేవలం ఐదు రోజుల గడువు ఇచ్చింది. లొంగిపోవాలని ఆదేశించింది. మేం ఎదిరించలేం అనుకొన్నది. ఉక్రెయిన్ ఆక్రమణకు ఐదు రోజులు చాలనుకొన్నారు. కానీ 50 రోజులైనా పోరాడుతున్నాం. చాలా గర్వంగా ఉంది’అన్నారు. శత్రువులకు ఏ మాత్రం వెరవకుండా పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ పౌరుల ధైర్యాన్ని కొనియాడారు. యుద్ధాన్ని అడ్డుకొనే ధైర్యం తమకు ఉందని, అవసరమైన ఆయుధాలను ఇవ్వాలని ప్రపంచాన్ని కోరారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై దాడులను ఉద్ధృతం చేస్తామని రష్యా శుక్రవారం హెచ్చరించింది. రష్యా భూభాగంలో ఉక్రెయిన్ ఉగ్రదాడులు చేస్తున్నదని ఆరోపించింది. గురువారం బ్రయాన్స్ నగరంపై ఉక్రెయిన్ హెలికాప్టర్లు దాడులకు తెగబడ్డాయని, ఏడుగురు రష్యా పౌరులు గాయపడ్డారని తెలిపింది. ఇందుకు ప్రతీకారంగా కీవ్‌ను లక్ష్యంగా చేసుకొంటామని పేర్కొన్నది. అన్నట్టుగానే శుక్రవారం కీవ్‌లో రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. ఓ మిలిటరీ ఫ్యాక్టరీని పేల్చివేసింది. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు భారీగానే ఆయుధ నష్టం జరిగినట్టు అనుమానిస్తున్నారు.