హనుమకొండ చౌరస్తా : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ (BC reservations) అమలు చేసేవరకు కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొని శక్తిగా నిలబడతామని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనచారి (MLC Madhusudanachari ) హెచ్చరించారు. శుక్రవారం హనుమకొండ బీఆర్ఎస్( BRS ) కార్యాలయంలో
పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ( Vinay Bhasker ) తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈనెల 18న తలపెట్టిన బీసీ సంఘాల రాష్ట్ర బంద్ పోస్టర్( State Bandu ) ను ఆవిష్కరించి వారు మాట్లాడారు.
బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాపార, ఉద్యోగ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాల ద్వారా బీసీ సమాజాన్ని అడ్డుకోవాలని చూస్తే మరో తెలంగాణ ఉద్యమంలా బీసీ పోరాటం ఉండబోతుందని హెచ్చరించారు. బీసీల కులగణన, జనగణన చేయమని అడుగుతున్నాం. 60 శాతం ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అడుగుతున్నామన్నారు.
స్వతంత్ర భారతావనిలో బీసీ సమాజం బాధ్యతలు మోసింది తప్పా అధికారంలో భాగస్వామ్యం తక్కువైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అడ్డుకున్నదని ఆరోపించారు. బీసీ సంఘాల నేతలు పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌ను సైతం కలిసి మద్దతు కోరగా పార్టీ మద్దతు ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్థానిక సంస్థలలో బ్రూణహత్యలకు పాల్పడి రిజర్వేషన్ అడ్డుకుందని, శిశువును గర్భంలో ఉండగానే కాంగ్రెస్ కుట్రలు చేసిందన్నారు.
బీసీలంతా ఐక్యంగా 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. హేతువద్దమైన బీసీల డిమాండ్‌ను ఇతర వర్గాలు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. బీసీల అభ్యున్నతి కోసం గత సీఎం కేసీఆర్ వెయ్యి గురుకులాలు ప్రారంభించారని గుర్తుచేశారు. కిందిస్థాయి నుంచి పైకి ఎదగాలంటే రిజర్వేషన్లు తప్పనిసరని అన్నారు.
42 శాతం అమల్లోకి వస్తే బీసీలు ఎదుగుతారని కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ దృష్టిలో బీసీలంటే రోబోలని, దశాబ్దాలుగా బీసీలపై జరుగుతున్న అణిచివేతకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అందని ద్రాక్షగా మారిన బీసీల ఆవేదన రేవంత్‌రెడ్డికి కనిపించడంలేదు. బడ్జెట్లో వాటా అడగడం తప్పా. లక్షల కోట్ల బడ్జెట్లో కేవలం బీసీలకు రెండు, మూడు కోట్లు బిచ్చమేస్తున్నారని మండిపడ్డారు.
దమ్ము, ధైర్యం ఉంటే రాహుల్ గాంధీతో పార్లమెంటును స్తంభింపజేయాలి
దమ్ము, ధైర్యం ఉంటే రాహుల్ గాంధీతో పార్లమెంటును స్తంభింపజేయాలని, ఓరుగల్లు వేదికగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని దాస్యం వినయ్‌భాస్కర్ వెల్లడించారు. 42 రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని, బీసీలపై రేవంత్‌రెడ్డి డ్రామాలు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి స్పీకర్‌గా బీసీ బిడ్డ మధుసూదనాచారిని, మండలి స్పీకర్‌గా స్వామిగౌడ్‌ను, ప్రభుత్వ చీఫ్ విప్‌గా తనను ఎంపిక చేసి, రాజకీయంగా బీసీ నేతలకు సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు.