Harish Rao | హైదరాబాద్ : కాంట్రాక్టుల్లో వాటాల కోసమే కాంగ్రెస్ నేతల మధ్య తగాదాలు ఏర్పడుతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. కమీషన్ల కోసం ఒకరు, కాంట్రాక్టుల కోసం ఒకరు, వాటాల కోసం ఒకరు, అక్రమ వసూళ్ల కోసం, కబ్జాల కోసం ఒకరు అని వర్గాలుగా విడిపోయారు. ఇవాళ కేబినెట్ మీటింగ్ దండుపాళ్యం ముఠా లాగా అయిపోయింది అని హరీశ్‌రావు విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఈ ఏడాది అతి తక్కువ పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయి. వ్యాపారవేత్తలకు తుపాకులు ఎక్కుపెట్టి బెదిరించి వసూలు చేస్తున్న సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. ఇది మేం చేస్తున్న ఆరోపణలు కాదు.. స్వయంగా ఒక మంత్రి కుమార్తె చెప్పిన వాస్తవం. హోం శాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉంటే నిస్పాక్షిక దర్యాప్తు ఎలా జరుగుతుంది..? మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి.. రాష్ట్రం పరువు బజారున పడేస్తున్నారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కేసీఆర్ తన పాలనలో కేంద్రంతో కొట్లాడి నీళ్ల వాటా, నిధుల వాటా సాధించారు. కేసీఆర్ హయాంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ ఉండేది. టెక్ మహేంద్ర సీఈఓ వచ్చినప్పుడు వర్షం పడుతుంటే తానే గొడుగు పట్టి వ్యాపారవేత్తలను ఆహ్వానించిన సంస్కృతి మాది.. తుపాకులు పెట్టి వసూళ్ళు చేస్తున్న సంస్కృతి మీది. రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణలోకి గన్ కల్చర్ తీసుకువచ్చాడు.. అందుకే ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గిపోయాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మంత్రులు వాటాల కోసం కొట్టుకుంటుంటే సీఎం చోద్యం చేస్తున్నారు. ముఠా పంచాయితీలు తెంపుకోవడానికి నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరికి అందినకాడికి వారు దోచుకుంటున్నారు అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.