Regina | సౌత్ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కసాండ్రా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా మత మార్పిడి గురించి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించిన రెజీనా, కేవలం 9 ఏళ్ల వయసులోనే పిల్లల టీవీ ఛానల్లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. తన ముద్దుముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, చిన్నతనంలోనే కళారంగంపై ఆసక్తి చూపింది. 14 ఏళ్ల వయసులో నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం ‘కంద నాన్ మూ’ లో లైలా చెల్లెలుగా నటించింది.
ఆ తర్వాత 2012లో తెలుగు సినిమా ‘శివ మనసులో శ్రుతి’ తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోనే సైమా ఉత్తమ తొలి నటి అవార్డు అందుకుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన రెజీనా, తెలుగులో ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ సంపాదించింది. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘ఈనాడు’, ‘అవును 2’, ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ వంటి సినిమాల ద్వారా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ తన మత మార్పు గురించి ఓపెన్‌గా చెప్పింది. “నా నాన్న ముస్లిం, అమ్మ క్రిస్టియన్. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. చిన్నతనంలో నేను ముస్లింగా పెరిగాను. ఆ తర్వాత, ఆరు సంవత్సరాల వయసులో క్రిస్టియన్‌గా మారిపోయాను.” అని ఆమె వెల్లడించింది.
ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఆమె ఓపెన్నెస్ను ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆమె జీవిత ప్రయాణంపై ఆసక్తిగా స్పందిస్తున్నారు. వివిధ మతాలు, సంస్కృతుల మధ్య పెరిగిన రెజీనా, తన ప్రతిభతో సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె తన నమ్మకాలు, వ్యక్తిగత అనుభవాలను ధైర్యంగా పంచుకోవడం ఆమె వ్యక్తిత్వానికి సంబంధించిన మరో కొత్త కోణాన్ని చూపిస్తోంది.