వినాయక్ నగర్ : కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య( Suicide ) కు యత్నించిన ముగ్గురిలో ఇద్దరు మృత్యువాత పడగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ ప్రాంతానికి చెందిన దాసరి కిషన్ (68), భార్య దాసరి నాగమణి, కుమారుడు దాసరి వంశీ(30) కుటుంబ కలహాల కారణంగా ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో తీవ్ర అస్వస్థకు గురైన ముగ్గురిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ ఇంటి పెద్ద దాసరి కిషన్ మృతి చెందగా భార్య నాగమణి, కొడుకు వంశీ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
మృత్యువుతో పోరాడుతున్న తల్లి, కొడుకుల్లో దాసరి వంశీ గురువారం మరణించాడు. తల్లి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు , కుటుంబ సభ్యులు తెలిపారు. దంపతుల చిన్న కుమారుడు జరిగిన ఘటనను తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికులకు కన్నీరు తెప్పిస్తోంది.