హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లతోపాటు మిషన్ భగీరథ రిజర్వాయర్లు సైతం అప్పుడే డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. భూగర్భజలాలు కూడా అంతకంతకూ పడిపోతున్నాయి. వెరసి రాబోయే రెండు నెలల పాటు తాగునీటికి తిప్పలు తప్పని దుస్థితి నెలకొన్నది. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. కృష్ణాతోపాటు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని జలాశయాల్లో సైతం నీటి నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో గత నెల 23న 22 టీఎంసీల నీళ్లు ఉండగా, ప్రస్తుతం 11.88 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. నెలలోనే దాదాపు 11 టీఎంసీల మేర నీటినిల్వలు పడిపోయాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ లెవల్ 320 మీటర్లు కాగా, ప్రస్తుతం 324 మీటర్ల వరకే నీళ్లున్నాయి. నీటి నిల్వలు మరో నాలుగు మీటర్లు పడిపోతే, ఎస్సారెస్పీ డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంది.
అదే జరిగితే, నీటిని విడుదల చేయడం కష్టమే. ఒకవేళ చేసినా ప్రాజెక్టులో భారీగా సిల్ట్ ఉన్న కారణంగా బురదే వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి వేసవి తాగునీటి అవసరాలకు ప్రతి నెలా అర టీఎంసీ నీళ్లు అవసరం. రాబోయే రెండు నెలలకు ఒక టీఎంసీ నీళ్లు అవసరం. దీంతో ఈ ప్రాజెక్టు కింద తాగునీటి కష్టాలు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కరీంనగర్ నగరానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న ఎల్ఎండీలోనూ పరిస్థితి దారుణంగా ఉన్నది. నెల క్రితమే డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. 24.034 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్ఎండీలో ప్రస్తుతం 7.31 టీఎంసీలు మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో కరీంనగర్ నగర ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తాగునీటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు కరీంనగర్ నగరపాలక సంస్థకు సూచించారు. మిడ్ మానేరులోనూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. కడెం, నిజాంసాగర్లోనూ మిషన్ భగీరథకు ఈ ఏడాది నీటి కష్టాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 54 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ లెవల్ 834 అడుగులు కాగా, ఇప్పటికే 833 అడుగులకు పడిపోయింది. అయితే, చిట్టచివరిగా 800 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకునే అవకాశం ఉన్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ లెవల్ 510 అడుగులు కాగా, ఇప్పటికే నీటి నిల్వలు 519 అడుగులకు పడిపోయాయి. సాగర్‌లో వినియోగానికి సుమారు 16 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా కూడా ఉన్నది. హైదరాబాద్‌తోపాటు నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల తాగునీటి అవసరాలకు దాదాపు 16 టీఎంసీలు అవసరమని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడా తాగునీటికి తండ్లాట తప్పని పరిస్థితి నెలకొన్నది.
వివిధ ప్రాజెక్టుల్లో భాగమైన పలు రిజర్వాయర్లను గ్రామాలకు తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకానికి గత ప్రభుత్వం అనుసంధానం చేసింది. అయితే, ప్రస్తుతం ఆయా రిజర్వాయర్లన్నీ ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. పాలేరు రిజర్వాయర్ ద్వారా ఖమ్మం సహా ఐదు జిల్లాల్లోని 2,450 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించాల్సి ఉన్నది. పాలేరు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 9 అడుగులకు నీటి నిల్వలు పడిపోయాయి. రిజర్వాయర్ సామర్థ్యం 2.558 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఒక టీఎంసీ మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎల్లూర్ రిజర్వాయర్‌లో నీటి నిల్వల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నది. కోయిల్‌సాగర్, రామన్‌పాడు, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వైరా, పెండ్లిపాకల, ఉదయసముద్రం, గోపాలదిన్నె, శంకరసముద్రం, కుమ్రంభీం, మేడారం, భీమ్‌ఘన్‌పూర్, ధర్మసాగర్, చలివాగు తదితర ప్రాజెక్టులు మిషన్ భగీరథతో అనుసంధానమై ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరుకోగా, మరో 15 రోజులు గడిస్తే మిగిలినవి కూడా డెడ్ స్టోరేజీకి చేరుకోనున్నాయి. దీంతో ఆయా ప్రాజెక్టులపై తాగునీటి అవసరాల కోసం ఆధారపడిన పట్టణాలు, పల్లెలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.